సరదా కోసం సముద్ర తీరానికి వెళితే తీరని విషాదం మూటగట్టుకోవాల్సి వస్తోంది. సాగర్ తీరంలో జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఏంటి? ప్రకృతి విరుచుకుపడుతుందా? లేక మనుషులే ప్రమాదాన్ని పసికట్టలేక వాటి అంచులకు వెళ్తున్నారా? ఒక సూర్యలంక తీరం అనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీరంలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సరైన భద్రతా చర్యలు లేక అనేకమంది పర్యాటకులు ప్రాణాలు వదులుతున్నారు … వరుసగా జరుగుతున్న ఈ ఘటనలకు కారణాలేంటి ప్రకృతి కోపమా మానవ తప్పిదమా.
సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలి… కానీ అదే వరుసలో భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి… లేదంటే అనేక నిండు ప్రాణాలు కడలిలో కలిసిపోతాయి…అలాంటి వరుసలోనే నిన్న జరిగిన ఘటన ఆరు నిండు ప్రాణాలను బలి తీసుకుందని చెప్పవచ్చు. ఈ ఘటనలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు గల్లంతయ్యారు …నలుగురు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు ..ఇప్పటికీ ఇద్దరి జాడ కనిపించలేదు …నిన్నటి నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అయినా ఫలితం మాత్రం శూన్యం….ఓ పక్క కన్నబిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు …అయినా వారి కన్నీరు తుడిచే పరిస్థితి ఎవరికీ లేదు.
ఇలాంటి ప్రమాదాలకు ఎవరు కారణం ? కేవలం సముద్రుడిపై నిందలు వేస్తే సరిపోతుందా …! మానవ తప్పిదం కూడా ప్రమాదాల్లో స్పష్టంగా కనిపిస్తుందా అంటే ప్రకృతి కంటే ఎక్కువ మానవ తప్పిదం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి అని స్పష్టం అవుతుంది. నిర్ణీత ప్రదేశం దాటి లో లోపలకు వెళుతున్న యువత ప్రమాదాలకు గురవుతున్నారు అని చెప్పవచ్చు. మరికొన్ని ఘటనలో ఫూటుగా గా మందు తాగి సముద్రంలోకి ఈతకు దిగే అనేకమంది యువత ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు… ఇంటి వద్ద విహారయాత్ర అని చెప్పి వస్తున్న యువత సాగర తీరంలో అలల సవ్వడికి సంబర పడుతున్నారో ఏమో లేక సముద్రం లోతు ఎంతో చూడాలనుకుంటున్నారో తెలియదు కానీ పరిమితి దాటి సాగర తీరంలో యువత కేరింతలు కొట్టడం వల్లే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
Read Also: The Sun: సూర్యుడిపై భారీ విస్పోటనం.. 2 లక్షల కిలోమీటర్ల పొడవైన సౌరజ్వాల
ఈ విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వం గతంలో సూర్యలంక తీర ప్రాంతంలో బీచ్ వెంబడి గజఈతగాళ్ళను మోహించింది. వీళ్లకు ప్రభుత్వం తరఫున నెలకు జీతం ఇచ్చేది. వీళ్ళ పని సాగర తీరంలో నిర్ణీత ప్రదేశం దాటి ఎవరూ లోపలికి వెళ్లకుండా చూడడమే. సూర్యలంక తీర ప్రాంతం పొడవునా రోప్ కట్టి జెండాలు పాతి ఇక్కడ పహారా కాసేవాళ్లు ….అయితే గడిచిన కొద్ది నెలలుగా నిధులు లేవంటూ వీరికి జీతాలు ఇవ్వకపోవడంతో ఆ పని మానేశారు గజఈతగాళ్లు. ఇవే ఇప్పుడు యువత ప్రాణాలు పోవడానికి కారణమైందా అన్న అనుమానం ప్రజల్లో ఉంది. సాగర తీరంలో గస్తీ అనేది చాలా అవసరం మెరైన్ పోలీసులు ఉన్న పూర్తి స్థాయిలో వాళ్లు సాగర తీరంలో నిఘా పెట్టలేకపోతున్నారు.
ప్రత్యేక బోట్లలో గజఈతగాళ్ళు నిఘా పెట్టడం వల్ల గతంలో పదుల సంఖ్యలో గల్లంతవుతున్న వారి ప్రాణాలు కాపాడగలిగారు. కానీ ఇప్పుడు ఒకే ఒక ప్రమాదంలో దాదాపు అరడజను మంది యువత ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది…. దీనిపై చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా ప్రాణాలు పోయిన తర్వాత గాలింపు చర్యలు చేపట్టే కన్నా ఆ ఖర్చేదో ముందే గజ ఈతగాళ్లకు జీతాలు ఇచ్చి ఉంటే ఈ ప్రమాదాలు జరిగేవి కాదు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్థానికంగా ఉన్న జిల్లా అధికారులు, పర్యాటక రంగానికి సంబంధించిన అధికారులు సమన్వయంతో తీర ప్రాంతంలో నిఘా బలపరిచి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు అంటున్నారు బాధితులు. ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి తీరం వెంబడి గస్తీ ఏర్పాటు చేయాలి.. నిఘా పెంచాలి… సాగర తీరంలో మద్యం మత్తులో ఊగిపోతూ వస్తున్న యువతను నియంత్రించాలి. నియంత్రణ రేఖ దాటి ప్రమాదాల అంచుకు వెళుతున్న యువతను కట్టడి చేయాలి. లేదంటే ఇలాంటివే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(గుంటూరు ప్రతినిధి కృష్ణ నాదెళ్ల సహకారంతో..)
Read ALso: Seeta The Incarnation: ప్రభాస్ ను మించేలా తెరపైకి మరో రాముడు..?
