Suresh Raina on Retirement: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయకపోవడం, ఆ తర్వాత జట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా స్పందించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆలోచనా విధానం, జట్టు ఎంపికలో తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన కెరీర్ చివరి రోజుల్లో జరిగిన పరిణామాలను వివరించాడు.
2019 ప్రపంచకప్‌కు ముందు తాను, యువరాజ్ సింగ్ ఇద్దరూ యోయో ఫిట్‌నెస్ టెస్టులో విఫలమయ్యామని రైనా వెల్లడించాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ టెస్టులో అర్హత సాధించడంతో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ భారీగా పరుగులు చేశామని తెలిపాడు. అయినప్పటికీ జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనేది కెప్టెన్ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ప్రతి కెప్టెన్‌కు తనదైన ప్రాధాన్యతలు, ఇష్టమైన ఆటగాళ్లు ఉంటారని.. కెప్టెన్ మారినప్పుడు జట్టు కూర్పు కూడా మారుతుందని వ్యాఖ్యానించాడు.
అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే కూడా తనకు కొన్ని విషయాలు చెప్పారని రైనా గుర్తుచేసుకున్నాడు. తాను, యువరాజ్ ఇద్దరూ మరింత మెరుగ్గా రాణించగలిగేవాళ్లమని భావించినప్పటికీ.. 2019 ప్రపంచకప్‌కు మరో కాంబినేషన్‌తో వెళ్లాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించుకుందని తెలిపాడు. అది వారి ఆలోచన అని, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నాడు. అయితే జట్టులో చోటు దక్కకపోవడంపై కెప్టెన్, కోచ్‌లతో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని రైనా చెప్పాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినా సరైన సమాధానాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన శ్రమ వృథా అవుతోందనే భావన కలిగిందని తెలిపాడు. ఒక సీనియర్ ఆటగాడిగా తనకు తగిన గౌరవం, వీడ్కోలు లభించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కనీసం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ఒక మ్యాచ్ అయినా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నాడు.
ఇక సురేశ్ రైనా అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. 2006లో టీ20 క్రికెట్‌తో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 768 పరుగులు, వన్డేల్లో 5,615 పరుగులు, టీ20ల్లో 1,604 పరుగులు సాధించాడు. వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. టీ20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు సాధించాడు. 2018లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. కాగా, 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

