దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఈ అంశంపై పార్టీ మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
READ MORE: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఇదేనా..?
“సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాటవాన్ని చదవాల్సి ఉంది. స్పీకర్ కి మూడు నెలల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా న్యాయ పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాం. ఇప్పుడప్పుడే ఉప ఎన్నికలు వస్తాయి అని కొందరు ఏదైతే ఊహించుకుంటున్నారు అలాంటిదేమీ ఉండకపోవచ్చు. స్పీకర్ నిర్ణయం తర్వాత.. జాతీయ ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉప ఎన్నికల విషయంలో చాలా సమయం ఉంది. గతంలో టీఆర్‌ఎస్(ప్రస్తుత బీఆర్‌ఎస్) లోకి మారిన ఎమ్మెల్యేల కేసు సైతం సుప్రీంకోర్టులో ఇంకా కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకు ఇంకా మేము రిప్లై ఇవ్వలేదు సమయం కోరాం. వీటన్ని అన్ని పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది.” అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు.