NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంలో చరిత్రాత్మక ఘట్టం.. విచారణలు ప్రత్యక్షప్రసారం

Supreme Court

Supreme Court

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం సుప్రీంకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయింది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం మొదలైంది. ప్రస్తుతం యూట్యూబ్ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలో సొంత మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు సీజేఐ జస్టిస్‌ జస్టిస్ యూయూ.లలిత్ సోమవారం తెలిపిన విషయం విదితమే. మంగళవారం దేశ చరిత్రలో తొలిసారిగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయగా.. తొలిరోదు సుమారు 7.74 లక్షల మంది వీక్షించారు. ఈ ఏడాది ఆగస్టు 26న అప్పటి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కోర్టు కార్యక్రమాలను తొలిసారి లాంఛనంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆపై నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. తాజాగా మూడు రాజ్యాంగ ధర్మాసనాల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడబ్ల్యూఎస్‌ కోటాపై విచారణ చేపట్టింది. ఈ విచారణను సుమారు 2.72 లక్షల మంది వీక్షించగా.. జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నాయకత్వంలోని ధర్మాసనం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, జాతీయ రాజధాని ప్రాంతంలో దిల్లీ ప్రభుత్వం అందించే సేవలపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకున్న శాసన-కార్యనిర్వాహక అధికారాల గురించి విచారించింది. ఆ విచారణ ప్రక్రియను దాదాపు 4 లక్షలమంది వీక్షించారు. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించారు.

Kerala High Court: గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అక్కర్లేదు..

ఇప్పటివరకు ఉన్న మూడు రాజ్యాంగ ధర్మాసనాలకు తోడు మరో ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్ ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎ.నజీర్‌ ఆధ్వర్యంలో ఈ నాలుగో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 2016లో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ ధర్మాసనం నేడు విచారించనుంది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. బెంచ్‌లోని ఇతర న్యాయమూర్తులలో జస్టిస్‌ బిఆర్ గవాయ్, జస్టిస్‌ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్‌ బివి నాగరత్న ఉన్నారు. రూ. 500, రూ. 1,000 పాత నోట్లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలపై వివిధ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఆ విచారణ ప్రక్రియలనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతానికి ముఖ్యమైన కేసులకే పరిమితమవుతున్నప్పటికీ.. అంతిమంగా అన్ని కోర్టుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఏర్పాటైన నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల్లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులకు స్థానం కల్పించారు.