Site icon NTV Telugu

Two-Finger Test Ban: లైంగిక దాడి కేసుల్లో ‘టూ ఫింగర్ టెస్ట్’ బ్యాన్ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Two-Finger Test Ban: అత్యాచార నిర్ధారణకు చేసే టూ ఫింగర్ టెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. టెక్నాలజీ ఎంతపెరిగినా ఇంకా డాక్టర్లు అత్యాచార బాధితులను పరీక్షించేందుకు ‘రెండు వేళ్ల పరీక్ష’ విధానం పాటించడం దురదృష్టకరమని అత్యున్నత న్యాయస్థానం భావించింది. ఇక మీదట ఇది జరగకుండా చూడాలని కేంద్ర, రాష్ట్రాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. దేశంలో టూ ఫింగర్ టెస్ట్ ని నిషేధించింది. ఈ విధానం వల్ల బాధితుల సమస్య తీరకపోగా మరోసారి వారు బాధితులు అవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వారికి ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే టూ ఫింగర్ టెస్ట్ జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: chocolate steal: చాక్లెట్ల దొంగతనం వీడియో వైరల్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్య

లైంగికదాడి, హత్య కేసులో దోషిగా తేలిన ఓ నిందితుడిని జార్ఖండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. దోషిగా నిర్ధారించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఇదే క్రమంలో రెండు వేళ్ల పరీక్ష పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగికదాడి నిర్ధారణకు డాక్టర్లు ఈ విధానాన్ని ఫాలో అవడం అమానవీయం అని, ఈ రకమైన టెస్ట్ బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరం అని 2013లోనే సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అత్యాచార బాధితులు వారి గౌరవానికి భంగం కలిగించని చట్టపరమైన ఆశ్రయానికి అర్హులని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పాఠ్యాంశాలను సమీక్షించాలని, ‘రెండు వేళ్ల పరీక్ష’కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారిని పరీక్షించడానికి కొత్త విధానం ద్వారా ఆరోగ్య సిబ్బందికి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు కోరింది.

Exit mobile version