Supreme Court : ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నంత మాత్రాన మీకు మేం కేసు నుంచి రక్షణ కల్పించలేం అని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోసం భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓ ఎన్‌ఎస్‌జీ కమాండో వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్‌లో పనిచేస్తున్నాడు.
అతను వరకట్నం కోసం భార్యను చంపేశాడనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లోని ట్రయల్ కోర్టు 2004లో విచారణ జరిపి అతనే హత్య చేసినట్టు తీర్పు ఇచ్చింది. 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా.. అతను హైకోర్టుకు వెళ్లాడు.
అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. అయితే మొన్న ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో తాను పాల్గొన్నానని.. అందుకోసం తనకు ఈ కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ధర్మాసనం సీరియస్ అయింది. ఆ కారణంతో మీకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ‘ఇది అత్యంత దారుణమైన ఘటన. ఈ కేసులో మీరు లొంగిపోవాలి’ అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
