NTV Telugu Site icon

Supreme Court: హిమాచల్‌ ప్రదేశ్ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్.. స్టేకు నిరాకరణ

Sc

Sc

హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కోరింది. ఆరుగురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారిని అనుమతించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పీకర్ కుల్దీప్ సింగ్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించాలని రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. స్టే విధించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని.. దీనిపై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పీకర్‌కు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.

సార్వత్రిక ఎన్నికల కోసం గత శనివారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అనర్హత వేటు పడిన ఆరు స్థానాల్లో కూడా ఉప ఎన్నిక చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు మే 7 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది.

అయితే గత ఫిబ్రవరి నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ ధిక్కరించి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వీరిపై ఫిబ్రవరి 29న స్పీకర్‌ అనర్హత వేటు విధించారు. దీనిపై వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఎమ్మెల్యేలపై వేటుతో అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం 40 నుంచి 34కి పడిపోయింది.

ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు వీరే: సుధీర్ శర్మ (ధర్మశాల), రవి ఠాకూర్ (లాహౌల్-స్పితి), రాజిందర్ రాణా (సుజన్‌పూర్), ఇందర్ దత్ లఖన్‌పాల్ (బార్సర్), చైతన్య శర్మ (గాగ్రేట్) మరియు దేవిందర్ కుమార్ (కుట్లేహర్)

హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలపై వేటు పడడంతో ఆ సంఖ్య 62కి పడిపోయింది. ఇదిలా ఉంటే 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ మాత్రం రాజ్యసభ సీటును దక్కించుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకే మద్దతుగా నిలిచారు.

Show comments