NTV Telugu Site icon

Supreme court: చైల్డ్ పోర్నోగ్రఫీపై హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం.. ఇదేం తీర్పు..?

Supr

Supr

చైల్డ్ పోర్నోగ్రఫీపై హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇదేం తీర్పు అంటూ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో నేరం కింద పరిగణించలేమంటూ జనవరిలో హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం అశ్చర్యం వ్యక్తం చేసింది.

పిల్లల అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడం నేరంగా పరిగణించరాదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు… తమిళనాడు పోలీసులకు, నిందితుడికి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకోవడం నేరం కాదని.. వీడియోలను ప్రసారం చేయడం లేదా పంపిణీ చేస్తేనే నేరంగా పరిగణించాలని మద్రాసు హైకోర్టు పేర్కొంది. నిందితుడు మెటీరియల్‌ని సృష్టించి.. ప్రసారం చేస్తే నేరంగా పరిగణించాలని.. కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మాత్రం నేరంగా చూడలేమని కోర్టు పేర్కొంది. దీంతో 28 ఏళ్ల వ్యక్తిపై విచారణను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.

ఇక నిందితుడు అశ్లీల వ్యసనంతో బాధపడుతున్నాడని.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భవిష్యత్ కోసం నిందితుడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కోర్టు సూచించింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అశ్లీలతపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అశ్లీల వీడియోలు తొలగించాలంటూ యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు ఇప్పటికే నోటీసులు పంపింది. పోర్నో వీడియోలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పిల్లల అశ్లీల కంటెంట్‌ను శాశ్వతంగా తొలగించాలని లేదా యాక్సెస్‌ని నిలిపివేయాలని సూచించింది.

Show comments