Site icon NTV Telugu

40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీం ఆదేశం!

supreme court

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 అంతస్తులు కట్టేశారు. వందల కోట్లు ధార పోశారు. చివరకు అది అక్రమమని తేలడంతో.. భవనాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని నేలమట్టం చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం.. ప్లాట్ ఓనర్లకు 12శాతం ఇంట్రెస్ట్‌తో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎమరాల్డ్‌ కోర్టు ప్రాజెక్టులో భాగంగా ఈ ట్విన్ టవర్స్‌ను సూపర్ టెక్‌ సంస్థ నిర్మించింది. ఇందులో 900లకు పైగా ప్లాట్స్ ఉన్నాయి.

నిబంధనలు ఉల్లంఘించి భవన నిర్మాణం జరిగిందంటూ 2014లోనే అలహాబాద్ హైకోర్టు నిర్ధారించింది. దీనిపై సూపర్ టెక్‌ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది. నోయిడా అథారిటీ అధికారులు, సూపర్‌ టెక్ ప్రతినిథులతో కుమ్మక్కయ్యారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూడు నెలల్లోగా కూల్చివేతలు పూర్తి చేయాలని.. దీనికి అయ్యే ఖర్చును సూపర్ టెక్‌ భరించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని కూలగొట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏం చేయాలో తెలియక దాని యాజమాన్యం తలపట్టుకుంటోంది.

Exit mobile version