ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) పై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (ECI), కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లతో దీనిని జత చేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతుందని, ఇది రాష్ట్రాల అప్పులను పెంచి భవిష్యత్తు తరాలపై పెను భారం వేస్తుందని పిటిషనర్ వాదించారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీల వల్ల ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుంది? ఆ నిధులను ఎక్కడి నుంచి సేకరిస్తారు? అనే విషయాలను స్పష్టం చేస్తూ ‘ఆర్థిక ప్రభావ ప్రకటన’ (Fiscal Impact Statement) సమర్పించాలని కోరారు.
Also Read:New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
నిబంధనలు ఉల్లంఘించే లేదా ఆర్థికంగా సాధ్యం కాని హామీలు ఇచ్చే పార్టీలపై గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలకు, అనవసరమైన ఉచితాలకు మధ్య ఉన్న సన్నని గీతను ఈ విచారణ తేల్చనుంది. ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణను కాపాడటమే లక్ష్యంగా ఈ పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణ అనంతరం కేంద్రం , ఎన్నికల సంఘం ఇచ్చే వివరణలు భారత ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
