Supreme Court: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు ఈరోజు సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం సత్యేందర్ జైన్ హెల్త్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆయనకు ఉపశమనం కల్పించింది. సత్యేందర్ జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను జులై 24న సుప్రీంకోర్టు ఐదు వారాల పాటు పొడిగించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. మధ్యంతర బెయిల్ పొడిగింపును తీవ్రంగా వ్యతిరేకించారు. మే 26న అత్యున్నత న్యాయస్థానం వైద్యపరమైన కారణాలతో జైన్‌కు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఒక పౌరుడికి తన సొంత ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు నచ్చిన చికిత్స పొందే హక్కు ఉందని పేర్కొంది.
Read Also: Supreme Court: బ్యాడ్మింటన్ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?.. సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
జైన్‌తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తు సంస్థ జైన్‌ను గతేడాది మే 30న అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో సత్యేందర్ జైన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్టు 2019 సెప్టెంబర్ 6న ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.