Site icon NTV Telugu

ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !

ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు, లాయర్లు కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. కోర్టుల భద్రత అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైందన్నారు. కోర్టుల భద్రత అంశంపై వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ.శుక్రవారం ఢిల్లీ రోహిణి కోర్టులో తుపాకుల మోత మోగింది. లాయర్ల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని కాల్చి చంపారు.

వెంటనే అలర్టయిన పోలీసులు… నిందితులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల మోతతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. మొత్తం 30 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. రూమ్‌ నెంబర్ 207లో ఈ కాల్పులు జరిగాయి. ఢిల్లీకి చెందిన టిల్లూ గ్యాంగ్ జితేంద్రను హత్య చేసినట్లు తెలుస్తోంది. జితేందర్‌ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్‌ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. తన గ్యాంగ్‌ను తుడిచిపెట్టేసిన జితేందర్‌పై కసితో ఉన్న టిల్లు అప్పట్నుంచి పగతో రగిలిపోతున్నాడు. జైలు నుంచే జితేందర్‌ గోగి హత్యకు కుట్రపన్నాడు. సక్సెస్‌ అయ్యాడు.

ఈ ఘటనతతో రోహిణీ కోర్టులో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. పటిష్ఠ భద్రత ఉండే కోర్టులోకి తుపాకులు ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. లోపలకు వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అయినప్పటికీ ఆయుధాలు లోపలకు ఎలా తీసుకెళ్లారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్కడ భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కోర్టులోకి ఎవరు వస్తున్నారు, ఏం తెస్తున్నారనేది పోలీసులు ఎప్పుడూ పట్టించుకోరని లాయర్లు కూడా ఆరోపిస్తున్నారు

Exit mobile version