Sunil Chhetri Retirement: భారత్ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. రెండు దశాబ్దాలుగా భారత ఫుట్‌బాల్ జట్టుకు వెన్నముఖగా ఉన్న సునీల్ ఛెత్రి.. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన భారత కెప్టెన్ ఛెత్రి ఇప్పుడు వీడ్కోలు పలికాడు. గురువారం భారత్, కువైట్ జట్ల మధ్య మ్యాచ్ 0-0తో డ్రా అయింది. తన చివరి మ్యాచ్‌లో భారత జట్టును గెలిపించడానికి ఛెత్రి తీవ్రంగా శ్రమించాడు. అయితే కువైట్ గట్టి పోటీనివ్వడంతో విజయం సాధ్యం కాలేదు.
భారత ప్లేయర్స్, ప్రత్యర్థి ఆటగాళ్లు, కోచ్‌లు సునీల్ ఛెత్రికి ఘనమైన వీడ్కోలు పలికారు. చివరిసారిగా భారత కెప్టెన్ ఆటను చూసేందుకు తరలివచ్చిన ఫాన్స్.. చప్పట్లతో గుడ్‌బై చెప్పారు. మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆటగాళ్ల గార్డ్ ఆఫ్ హానర్ మధ్య ఛెత్రి నిష్క్రమించాడు. స్టాండ్స్‌లోని అతని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఛెత్రి మరో రెండేళ్లు ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు తరపున ఆడే అవకాశముంది.
Also Read: PAK vs USA: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాకిస్థాన్‌పై అమెరికా విజయం!
సునీల్ ఛెత్రి 2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వచించాడు. భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి.. 94 గోల్స్ కొట్టాడు. ఇందులో నాలుగు హ్యాట్రిక్‌లు ఉన్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లియోనెల్ మెస్సీ (180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్‌రత్న పురస్కారాలను ఛెత్రి అందుకున్నాడు.