Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ సీఎం పదవి ఎవరిని వరిస్తుందో అన్నదానికి తెరపడింది. సుఖ్విందర్ సింగ్ సుఖు కొత్త సీఎంగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీనిపై పార్టీ పరిశీలకుల్లో ఒకరైన చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పరిశీలకుడు భూపేశ్ భగేల్ స్పందిస్తూ, సీఎం ఎంపిక నిర్ణయాధికారాన్ని సీఎల్పీ అధిష్టానికే అప్పగించడంతో, హైకమాండ్ సుఖు పేరును ఖరారు చేసిందన్నారు. ఇంతకుముందున్న బీజేపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న ముకేశ్ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. సీఎం పదవి కోసం సుఖు సహా నలుగురు నేతలు పోటీలో ఉండటంతో సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పార్టీ సాంప్రదాయం ప్రకారం ఏక వాక్యతీర్మానం చేసి సీఎం ఎంపికను అధిష్టానానికే వదిలేశారు. హిమాచల్ ప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేయాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానించారని రాజీవ్ శుక్లా చెప్పారు.
Read Also: Mahesh Babu : మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది
సీఎం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు (డిసెంబరు 11) ఉదయం 11 గంటలకు జరగనుందని భగేల్ తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ పేరు బలంగా వినిపించినా, పార్టీ అధిష్ఠానం సుఖ్విందర్ సింగ్ వైపే మొగ్గుచూపింది. సుఖ్విందర్ సింగ్ సుఖు నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పనిచేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్విందర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు సాధించగా బీజేపీ 25 స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.