NTV Telugu Site icon

Sukesh Chandrashekar: ఆప్‌పై సీబీఐ విచారణ జరిపించాలి.. సుఖేష్‌ చంద్రశేఖర్‌ తీవ్ర ఆరోపణలు

Sukesh Chandrashekar

Sukesh Chandrashekar

Sukesh Chandrashekar: అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టం కింద పలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఇంతకు ముందే ఓ లేఖను విడుదల చేయగా మరో లేఖను సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం పంజాబ్, గోవా ఎన్నికల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు సుఖేష్ తన రెండో లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలను ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. గోవా, పంజాబ్ ఎన్నికల కోసం ఆమ్ ఆదామీ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్ ఆ పార్టీకి డబ్బులు చెల్లించాలని అడిగారని కూడా ఆయన ఆరోపించారు.

కానీ తాను వాటిని పట్టించుకోకుండా నిశ్శబ్ధంగా ఉన్నానని.. కానీ జైలు పరపాలన అధికారుల ద్వారా నిరంతరం బెదిరింపులు కొనసాగాయని సుఖేష్ లేఖలో వెల్లడించారు. తాను అబద్ధాలు చెబుతున్నానని ఆప్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన సుకేష్ చంద్రశేఖర్, తాను అబద్ధాలు చెబుతున్నట్లయితే, జైలు యంత్రాంగం తనపై ఎందుకు ఒత్తిడి తెస్తోందని లేదా గతంలో చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని అన్నారు. కేజ్రీవాల్‌, మాజీ డీజీ సందీప్‌ గోయల్‌, జైలు పరిపాలనపై హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని సత్యేందర్‌ జైన్‌ నిరంతరం తనను ఎందుకు అడిగారని లేఖలో తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ఎక్కువ నిధులు ఇవ్వమని అడగడమే కాకుండా తను నిరంతరం బెదిరించారన్నారు. ఆప్ నేతల తప్పు లేకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని తన లేఖలో పేర్కొన్నాడు.

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆదేశానుసారం పార్టీ, దాని నాయకుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆప్ నాయకుల ఆరోపణలను చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మరో లేఖ రాశారు. ఢిల్లీ ఎల్‌జీకి తన తాజా లేఖలో చంద్రశేఖర్ ఇలా రాశారు. ఆప్‌కు సంబంధించిన నిజాలు బయటికి రాకముందే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, అత్యవసరంగా సీబీఐ దర్యాప్తును ఆదేశించాలని,ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి తనను అనుమతించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ ఎల్జీకి తాను చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌, తీహార్‌ జైలు మాజీ డీజీ (జైళ్లు) తనను బెదిరిస్తున్నారని సుఖేష్‌ ఆరోపించారు. తనకు జైన్‌, మాజీ డీజీ నుంచి తీవ్రమైన ముప్పు ఉందని లేఖలో చెప్పాడు.

Bhopal: బాబోయ్ వీళ్లు లేడీలా రౌడీలా.. నడిరోడ్డుపై ఏంటీ దారుణం

ఇదిలా ఉండగా.. గతంలో కూడా రెండు సార్లు సుఖేష్ లేఖలు రాశాడు. తన రెండో లేఖలో రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్‌ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చిన ఆరోపణలు చేయడం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టించింది. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ముడుపులు అందించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సుకేశ్‌ లేఖ రాశాడు. తనను జైలులో తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని, తనకు రక్షణ కల్పించేందుకు జైలులోనే ఉన్న సత్యేంద్ర జైన్‌కు రక్షణ కోసం డబ్బులు ఇచ్చానని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ ఆరోపించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.50 కోట్లకు పైగా సుకేష్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. అందులో రాజ్యసభ నామినేషన్ కోసం రూ.50 కోట్లు తీసుకుందని పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అంటేనే ఒక మోసాల పార్టీ అంటూ ఆరోపించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు సుకేశ్‌ చంద్రశేఖర్‌ చేసిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు.