Site icon NTV Telugu

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య

Iit Kharagpur

Iit Kharagpur

IIT Kharagpur: ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోంది. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని విద్యార్ధులు, సిబ్బంది, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 4వ సంవత్సరం డ్యూయల్ డిగ్రీ విద్యార్థి కె.కిరణ్ చంద్ర ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని ఐఐటీ ఖరగ్‌పూర్ ఒక ప్రకటనలో తెలిపింది. లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్‌బీఎస్) హాల్ ఆఫ్ రెసిడెన్స్‌లో బస చేసి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

“సాయంత్రం 7:30 గంటల వరకు కిరణ్ చంద్ర తన ఇద్దరు రూమ్‌మేట్స్‌తో కలిసి వారి హాస్టల్ గదిలో ఉన్నాడు. తరువాత మిగిలిన ఇద్దరు విద్యార్థులు విద్యా కార్యకలాపాలకు బయలుదేరారు. తరువాత రాత్రి 8.30 గంటల ప్రాంతంలో, ఎల్‌బీఎస్ హాల్‌లోని తోటి విద్యార్థులు అతని గది లోపలి నుంచి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. తలుపు బలవంతంగా తెరిచారు… వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు. కిరణ్‌ చంద్ర రాత్రి 11:30 గంటలకు మరణించాడు. ”అని IIT ఖరగ్‌పూర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబం ఈ ఉదయం క్యాంపస్‌కు చేరుకుందని ఐఐటీ ఖరగ్‌పూర్ తెలిపింది.

Also Read: Same-Sex Marriage: ‘మరో రోజు పోరాడుతాం’.. సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట

డిసెంబరు 2021లో విద్యా మంత్రిత్వ శాఖ యొక్క డేటా ప్రకారం, 2014 నుంచి ఐఐటీల్లో 34 ఆత్మహత్యలు వెలుగుచూశాయి. వాటిలో 18 ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాల వర్గాల నుంచి వచ్చాయి. భారతదేశంలో అకడమిక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రతిరోజూ ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.2014, అక్టోబర్ 2022 మధ్య ఐఐటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. డిసెంబర్ 2019లో మానవ వనరుల మంత్రి పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు) 2019 వరకు ఐదేళ్లలో 60 మంది విద్యార్థుల ఆత్మహత్యలను చూశాయి. ఇందులో 23 ఐఐటీల్లో 50 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడగా.. 20 ఐఐఎంలు 10 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. ఐఐటీ బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటి హైదరాబాద్‌లలో 2019 వరకు ఐదేళ్లలో అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.

Exit mobile version