NTV Telugu Site icon

Storyboard: కేంద్ర బడ్జెట్ అందరిని నిరాశపరిచిందా..?

Union Budget 2024

Union Budget 2024

Storyboard: వ్యవసాయ, అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపుల్లో భారీ కత్తిరింపులు, అత్తెసరు ప్రతిపాదనలు.. ఇవీ ఎన్‌డిఎ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌ తీరు. ఎరువుల సబ్సిడీకి పెద్ద ఎత్తున కేటాయింపులు తగ్గించారు. ప్రధాన మంత్రి గరీబీ కళ్యాణ్‌ యోజన అమలు చేస్తామంటూనే ఆహార సబ్సిడీకి భారీగా కోత పెట్టారు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించే ఉపాధి హామీకి బొటాబొటిగా నిధులు ప్రతిపాదించారు. పంటల బీమా, పిఎం కిసాన్‌, ఇలా అన్ని పథకాలదీ ఇదే పరిస్థితి. ఎన్‌డిఎ సంకీర్ణ సర్కారు బడ్జెట్‌లో తొమ్మిది ప్రాధాన్యతలను పేర్కొనగా, వాటిలో మొదటిది వ్యవసాయోత్పత్తుల ఉత్పాదకత పెంపు. ఎరువుల సబ్సిడీ, ఆహార సేకరణ సబ్సిడీ, ఉపాధి హామీలకు నిధులివ్వకుండా ఏ విధంగా పంటల ఉత్పాదకత పెరుగుతుందో అర్థం కాదు. ఈ తడవ బడ్జెట్‌లో రైతుల ఆదాయాల రెట్టింపుపై మాట్లాడలేదు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆందోళనలు చేస్తుండగా బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. స్వామినాథన్‌ సిఫారసుల అమలును వదిలేసినట్లు కనిపిస్తోంది. ఎంఎస్‌పి లేని పంట ఉత్పత్తుల ధరలు తగ్గిన పక్షంలో మార్కెట్‌లో జోక్యం చేసుకునే స్కీంలను పూర్తిగా ఎత్తేశారు. ఆ స్థానంలో కార్పొరేట్లకు ఆస్కారం కలిగించే, సేకరణలో ప్రభుత్వ పాత్ర లేకుండా, ప్రైవేటు జోక్యానికి ఆస్కారం కలిగించే ‘పిఎం-ఆశా’ పథకానికి బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించారు.

ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు రైతులకు ఇచ్చే పిఎం కిసాన్‌కు రూ.60 వేల కోట్లే ప్రతిపాదించారు. గత ఏడాది కూడా అంతే కేటాయించారు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌కు రూ.14,600 కోట్లు చూపించారు. గతేడాది కంటే రూ.400 కోట్లు తక్కువ కేటాయించారు. ఎరువుల సబ్సిడీని బాగా తగ్గించారు. యూరియా సబ్సిడీకి ప్రభుత్వం 2022-23లో రూ.1,65,217 కోట్లు ఖర్చు చేయగా, గత ఏడాది బడ్జెట్‌లో రూ.1,31,099 కోట్లు ప్రతిపాదించి, రూ.1,28,596 కోట్లకు సవరించారు. ఇప్పుడు కేవలం రూ.1,19,000 కోట్లు కేటాయించారు. పోషక ఆధారిత ఎరువుల సబ్సిడీకి 2022-23లో రూ.86,122 కోట్లు ఖర్చు చేయగా, గత ఏడాది రూ.44,000 కోట్లు ప్రతిపాదించి రూ.60,300 కోట్లకు సవరించారు. ఇప్పుడు కేవలం రూ.45,000 కోట్లు ప్రతిపాదించారు. సబ్సిడీ తగ్గిన పక్షంలో డిఎపి, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం మాత్రం ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయానికి, నానో వైపు రైతులను మళ్లించి ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలని చూస్తోంది.ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లోని సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్​తో పోలిస్తే 7.8 శాతం సబ్సిడీల్లో కోతపెట్టింది. ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్​ అని అధికారపక్షం చెప్తుండగా.. ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్​లా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

బడ్జెట్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో కేంద్రంపైప కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. కేంద్రం యువత, రైతుల ప్రయోజనాలను విస్మరించిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. బీజేపీ పదేండ్ల వైఫల్యాలను దాచిపెట్టే మోసపూరిత చర్యగా బడ్జెట్‌ను సిపిఐ అభివర్ణించింది. ద్రవ్యోల్బణం, అసమానత, నిరుద్యోగం వంటి అంశాలను పరిష్కరించటంలో ప్రభుత్వ వైఫల్యంపై సిపిఎం నిరసనను ప్రకటించింది. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జీరో గ్యారెంటీ, జీరో వారంటీతో పనికి రాని బడ్జెట్‌ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ అభివర్ణించింది. బడ్జెట్ లో ఎక్కడా వెలుగు కనిపించడం లేదు.. అంతా చీకటే అన్నారు మమత. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌. కాపీ అండ్‌ పేస్ట్‌ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతులకు సంబంధించిన సబ్సిడీలకు కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఆహారం, వంటగ్యాస్‌, పెట్రోలియం, యూరియా వంటి వాటికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించింది. బడ్జెట్‌లో సామాన్య, పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. పైగా ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో కోత విధించారు. ఆహార సబ్సిడీకి సంబంధించి 2022-23 బడ్జెట్‌లో రూ. 2,72,802 కోట్లు కేటాయించగా, 2023-24లో దాన్ని రూ.2,12,332 కోట్లకు, 2024-25లో రూ.2,05,250 కోట్లకు తగ్గించారు. ప్రజా పంపిణీకి 2023-24లో రూ 137.36 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.106.73 కోట్లకు తగ్గించారు. గ్యాస్‌ సబ్సిడీకి 2023-24లో రూ 12,240 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.11,925.01 కోట్లకు తగ్గించారు. పెట్రోలియానికి సంబంధించి 2023-24లో రూ.12,240 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25లో రూ.11,925 కోట్లకు తగ్గించారు. పంటల బీమా పథకానికి సంబంధించి 2023-24 బడ్జెట్‌లో రూ.15,000 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25 బడ్జెట్‌లో రూ. 14,600 కోట్లకు తగ్గించారు. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ కి కేటాయింపులే లేవు. స్మార్ట్‌ సిటీలకు 2023-24లో రూ 13,200 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10,400 కోట్లకు తగ్గించారు. అంగన్‌వాడీలకు 2023-24లో రూ 21,523.13 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.21,200 కోట్లకు తగ్గించారు. మహిళా భద్రత పథకాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. 2023-24లో రూ.1,009 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.155 కోట్లకు తగ్గించారు.