NTV Telugu Site icon

Pawan Kalyan: అటవీశాఖలో దశల వారీగా మార్పులు, ప్రాధాన్య అంశాలపై డిప్యూటీ సీఎం ఫోకస్..

Pawan Kalyan

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతిని సాధించలేకపోయిందని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. సమర్ధత కలిగిన నాయకత్వం అటవీ శాఖకు ఉన్నప్పటికీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాఖలో పూర్తిస్థాయి మార్పుచేర్పులతో మళ్లీ అటవీశాఖ రాష్ట్ర అవసరాల్లో, అభివృద్ధిలో ప్రాధాన్య స్థానంలో నిలిపేందుకు డిప్యూటీ సీఎం ప్రయత్నం మొదలుపెట్టారు. నూతనోత్తేజంతో, అద్భుత ప్రగతిలో అటవీ శాఖ పచ్చగా కళకళలాడాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు.

అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ భూముల పరిరక్షణను తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారు. ముఖ్యంగా కడప అటవీ డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ డివిజన్ పరిధిలో విలువైన భూములు, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే భూములను రక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. భూములకు కంచెలు వేయడం, పరిరక్షణకు నిఘా చర్యలు ఉంటాయి.

ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
శేషాచలంలో లభ్యమయ్యే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంపైనా పవన్ కల్యాణ్ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి వేర్వేరు మార్గాల్లో ఇతర రాష్ట్రాల సరిహద్దుల ద్వారా అక్రమ రవాణా అవుతున్న ఎర్రచందనాన్ని అరికట్టాలని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు దొరుకుతున్న ఎర్రచందనాన్ని వారు అక్కడే వేలం వేస్తున్నారు. ఇటీవల కర్ణాటక పోలీసులు రూ.100 కోట్ల ఎర్రచందనం పట్టుకొని అక్కడే వేలం వేశారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ఉంచాలని భావిస్తున్నారు.

అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపు
రాష్ట్రంలోని అడవుల్లో దొరుకుతున్న నాణ్యమైన, మేలైన, అరుదుగా దొరికే అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజనులను దీనిలో భాగం చేసి అరుదుగా దొరికే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం మీద తగిన మార్గం చూపనున్నారు. దానికి కార్పొరేట్ మార్కెట్ రంగంలో ఉన్నవారి సహకారం తీసుకోనున్నారు. ప్రజావసరాలు, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేకమైన మొక్కలను నాటడం, వాటి నుంచి అటవీ ఉత్పత్తులు తీసుకురావాలనే యోచన చేశారు. తద్వారా అటవీ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం కావడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. ఆదాయాన్ని ఇచ్చే మొక్కలు, అరుదైన జాతుల మొక్కలను విరివిగా పంపిణీ చేసి నాటి, సంరక్షించడం మీద ప్రజల్ని భాగస్వామ్యం చేస్తారు. మరోవైపు సీఎం చంద్రబాబు నిర్దేశించిన విధంగా రాష్ట్రం 50 శాత పచ్చదనం అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్లవచ్చని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. ఇక వన్య ప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అడవుల్లో వేటను నిషిద్ధం చేసి, నిఘాను పెంపొందించడంతో పాటు గిరిజనులు సైతం అటవీ ప్రాణుల రక్షణ పట్ల చైతన్యం తీసుకురావడం ప్రధానమైన అంశం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపు సమస్యపై చర్చించారు. ఇటీవల చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనపై సమీక్షించారు. కర్ణాటక ప్రభుత్వంతో మరోసారి మాట్లాడి కుంకీ ఏనుగులను త్వరితగతిన తీసుకురావాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్యలు
అటవీ శాఖలో నెలకొన్న సిబ్బంది కొరత సమస్యపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. సిబ్బంది తక్కువగా ఉండటం కూడా నిర్ణయాల అమలుకు ప్రధాన అడ్డంకిగా మారిందనే అంశంపై చర్చించారు. సిబ్బంది నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నగర వనాలు, ఏకో టూరిజం అభివృద్ధి పైనా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నారు.

కలప ద్వారా ఆదాయ సముపార్జన
మన దేశం ఏటా రూ.22 వేల కోట్ల విలువైన కలప ఆధారిత దిగుమతులను చేసుకుంటోంది. దీన్ని నివారించేందుకు, రాష్ట్ర అటవీ శాఖ ద్వారా దేశ అవసరాలకు తగిన కలప ఉత్పత్తులను తయారు చేసే దిశగా ఓ సమగ్రమైన ప్రణాళికను సిద్దం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రం నుంచి అధికంగా కలప ఉత్పత్తులు తయారు అయితే, దేశం దిగుమతి చేసుకునే ఉత్పత్తులను తయారు చేయగలిగితే అద్భుతాలు సాధించవచ్చు. 2047 నాటికి భారతదేశం కలప ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశకు చేరుకోవాలని, ఇందులో మన రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక స్థానం పొందాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ అంశంపై ఒక కార్యాచరణ నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.