NTV Telugu Site icon

STAR Hospitals: మూత్రపిండాల మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం..

Star Hospitals

Star Hospitals

మూత్రపిండాల మార్పిడి విషయంలో విప్లవాత్మకమైన ముందడుగుకు, గుణాత్మకమైన విధానాలకు మనదేశంలో శ్రీకారం చుడుతూ.. హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ వారు ‘పి.కె.డి’ అనే రిజిస్ట్రీ పద్ధతిని ప్రవేశపెడుతున్నారని స్టార్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం తెలియజేశారు. ‘పి.కె.డి’ అంటే – ‘కిడ్నీ పెయిర్డ్ డొనేషన్’ అని అర్థం. మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధితో బాధపడుతున్న లక్షలాది రోగులకు ఈ ‘పి.కె.డి’ రిజిస్ట్రీ పద్ధతి గొప్ప వరప్రసాదం కాగలదనీ వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే – స్టార్ హాస్పిటల్స్ వారు ‘కిడ్నీ స్వాప్ ట్రాన్స్ ప్లాంట్స్’ లోనూ.. ‘ఏబిఓ ఇన్ కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్’లోనూ విశేషమైన కృషితో అనేక విజయాలు పొంది, అవయవాల మార్పిడి రంగంలో పలు విప్లవాలకు దోహదం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పద్ధతి వల్ల లభించే అద్భుత అవకాశాలగురించి, ఈ పద్ధతిగురించి అనేక వివరాలను డా. గంధే శ్రీధర్, స్టార్ హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ – నెఫ్రాలజీ మరియు ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషియన్, డైరెక్టర్- నెఫ్రాలజీ ట్రాన్స్ ప్లాంట్ తెలియజేస్తూ, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు ఇంతటి విశేషసేవలు అందుబాటులోకి రావటంపట్ల తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.

డాక్టర్ స్వర్ణలత, ఇంచార్జ్ – జీవన్ దన్
మన భారత దేశంలో కిడ్నీ వైఫల్యం అనేది తీవ్రమైన స్థాయికి చేరుకుంది. ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య ఘననీయంగా పెరుగుతూ వుంది. స్టార్ హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం అవలంబిస్తున్న బహుముఖ విధానం అవయవ దాతల శాతాన్ని పెంచడానికి ఉత్తమమైన పద్ధతి అని, ఈ విధానం వల్ల దాతల శాతం పెరుగుతుందని జీవన్ దన్ ఇంచార్జ్ డాక్టర్ స్వర్ణలత ప్రశంసించారు. కిడ్నీ వైఫల్యం కారణంగా గణనీయమైన సంఖ్యలో వ్యక్తులు అవయవ దాతల కొరకు పోరాడుతున్నారని అన్నారు. ‘మూత్రపిండాల మార్పిడికై వేచిచూస్తున్నవారికి అమర్చేందుకు తగిన మూత్రపిండాలకోసం జరుగుతున్న అన్వేషణలో అందరూ పాల్గొనే అవకాశం కల్పిస్తుంది ‘పి.కె.డి’ రిజిస్ట్రీ పద్ధతి. మూత్రపిండాలను ఆశించేవారు, మూత్రపిండాలను దానం ఇవ్వదలిచినవారు పరస్పరం ఆన్లైన్లో కలుసుకునే స్థితి, ఈ రిజిస్ట్రీ పద్ధతిలో లభిస్తుంది. అలాగే, ఈ రిజిస్ట్రీ పద్ధతివల్ల మనదేశం మొత్తంమీద.. మూత్రపిండాల మార్పిడి వేగవంతం, సులభతరం అవటమే కాకుండా, సఫలవంతమైన మూత్రపిండాల మార్పిడికి మరింత వీలు కలుగుతుందని డా. గంధే శ్రీధర్ తమ ఆశాభావాన్ని తెలియజేశారు.

వాస్తవానికి మనదేశంలో మూత్రపిండాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం, మనదేశంలో ప్రతీ ఏడాదీ దాదాపు 2 లక్షలమందికి మించిన సంఖ్యలో రోగులకు మార్పిడి అవసరం అవుతోంది. కానీ, సుమారుగా 8 వేలనుంచి 10 వేల మూత్రపిండాల మార్పిడిలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే, అవసరంఉన్నదాంట్లో కేవలం 3.4 శాతంవరకే మార్పిడిలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. డయాబిటస్ (మధుమేహం), పోషకాలకొరత, కిక్కిరిసిన జనాభా, అతితక్కువ శానిటేషన్ వంటివన్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి)కి కారణమవుతున్నాయి. ఈ ‘సికెడి’ అనేది మనదేశ జనాభాలో దాదాపు 17 శాతంమందిని వేధిస్తోంది. “సికెడి” అనేది తీవ్రమయి, క్రమంగా ‘అంత్యదశ మూత్రపిండాల వ్యాధి’ (ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్) కు దారితీస్తుంది.

కిడ్నీ పెయిర్డ్ డొనేషన్, పి.కె.డి. అంటే…
మన శరీరంలో రక్తప్రసరణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ రక్తంలో చేరుకునే వివిధ మలినాలను పూర్తిగా శుభ్రం జేసి, ఆ మలినాలను మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపేసే బాధ్యతను మూత్రపిండాలు నిర్వర్తిస్తుంటాయి. అనేక కారణాలవల్ల కొందరిలో మూత్రపిండాలు పనిచేయకపోవచ్చు. ఇలా, మూత్రపిండాలు సక్రమంగా పనిచేయకపోవటం లేదా ‘మూత్రపిండాల వైఫల్యం’ అనే వ్యాధి భారతదేశంలో అనూహ్యమైన స్థితికి చేరుకుంది. ఈ వ్యాధిగ్రస్తులలో వేలాదిమంది తమ మూత్రపిండాల మార్పిడికి తగిన మూత్రపిండాల లభ్యతకోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చాలావరకూ ఈ మార్పిడికి తగిన మూత్రపిండాలు, చనిపోయినవారి శరీరాలనుంచే సేకరించటం జరుగుతోందన్నది వాస్తవం. అనేక సందర్భాలలో తగిన మూత్రపిండాలు సకాలంలో లభ్యం కాక, డయాలిసిస్ తోనే కొనసాగుతూ ఎందరో వ్యాధిగ్రస్తులు ఆ ఎదురుచూపులతోనే కన్నుమూస్తున్నారు. దురదృష్టకరమైన ఈ పరిస్థితిలో మార్పు తేవటం అత్యవసరమని చిరకాలంనుంచి భావిస్తున్న స్టార్ హాస్పిటల్స్ ఇప్పుడు ‘పి.కె.డి’కి నాంది పలుకుతున్నారు.

పెయిర్డ్ కిడ్నీ ఎక్స్ఛేంజ్ అంటే ఏమిటి?
‘శరీరంలో అవయవాలు విఫలమయినప్పుడు, సజీవంగా ఉన్న అవయవాన్ని దానంద్వారా పొందగలిగిన దాన్ని అమర్చటమే అత్యుత్తమం. మూత్రపిండాలు విఫలమయినప్పుడు సజీవ మూత్రపిండాలను అమర్చటమే ఉత్తమం. సజీవంగా ఉన్న వ్యక్తి తన మూత్రపిండాన్ని, అంత్యదశలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ఇవ్వటాన్ని ‘లివింగ్ రెనల్ ట్రాన్స్ ప్లాంట్’ అంటారు. అయితే, ఇలా దానం ఇచ్చేవారి రక్తంగ్రూప్, వ్యాధి చివరిదశలో ఉన్నవారి రక్తం గ్రూప్ ఒకటి అయితేనే, ఈ మార్పిడి సాధ్యమవుతుంది. దీన్ని ‘ఏబిఓ కంపాటిబుల్ ట్రాన్స్ ప్లాంట్’ అంటారు. ఈ రకమైన మార్పిడిలోనూ ఒక విషయం విశేషంగా గుర్తుంచుకోవాలి. ‘ఓ’ గ్రూప్రోక్తం ఉన్నవారు, ఏ, బి, ఏబి, లేదా ఓ గ్రూప్తోక్తం ఉన్న ఎవరికైనా తమ కిడ్నీలను దానం ఇవ్వవచ్చు అనేదే ఆ విశేషం. అంటే, ఓ గ్రూప్ రక్తం ఉన్నవారిని ‘యూనివర్సల్ డోనర్స్’ అని భావించవచ్చు. అలాగే, ఏబి గ్రూప్రోక్తం ఉన్నవారు – ఏ రక్తంగ్రూప్ ఉన్నవారినుంచైనా మూత్రపిండాలను స్వీకరించవచ్చు. అంటే, ‘ఏబి’ రక్తంగ్రూప్ ఉన్నవారు యూనివర్సల్ రిసిపియెంట్స్ అన్నమాట. కానీ.. శరీరంలో ఉన్న సహజమైన రక్తం గ్రూప్ నకు భిన్నమైన రక్తాన్ని మన శరీరం అంత తేలికగా ఆమోదించదు. ఈ తిరస్కరణను చేసే యాంటీబాడీస్ ను కూడా మన శరీరమే ఉత్పత్తి చేస్తుందనేది తెలిసిందే. ఫలితంగా ఈ విషయాలన్నింటినీ మార్పిడి సమయంలో వైద్యులు శ్రద్ధగా గమనించాల్సి ఉంటుందన్నది స్పష్టం.

పి.కె.డి. రిజిస్ట్రీ పనిచేసే విధానం
ఈ రిజిస్ట్రీ నిరంతరం కొనసాగేందుకు విస్తృతమైన రీతిలో అందరూ పాల్గొనే అవకాశం కల్పిస్తూ.. స్టార్ హాస్పిటల్స్ వారు ఒక ప్రత్యేక వెబ్ సైట్ను ప్రారంభించారు. స్నేహపూర్వకమైన యూజర్-ఫ్రెండ్లీ వెబ్సైట్ ద్వారా, కిడ్నీ పెయిర్డ్ డొనేషన్ రిజిస్ట్రీలో చేరవచ్చు. దీనివల్ల మూత్రపిండాలు కోరేవారు, మూత్రపిండాలు దానం ఇవ్వదలిచినవారు ఒక కేంద్రీకృతమైన ఆన్ లైన్ వేదిక మీద కలువగలుగుతారు. ఈ వెబ్ సైట్ల వల్ల – పెయిర్డ్ డొనేషన్ పద్ధతిలో కలిగే అనేక ప్రయోజనాలనూ అందరూ సవిరంగా.. సులభమైన రీతిలో తెలుసుకోగలుగుతారు, స్పష్టంగా గుర్తించగలుగుతారు. ‘పి.కె.డి రిజిస్ట్రీ అనేది ఒక అద్భుతమైన విధానం. మూత్రపిండాల మార్పిడి ప్రక్రియలో మూత్రపిండాల మార్పిడికి ఎదురుచూస్తున్న వారు, మూత్రపిండాలను దానం చేయదలిచినవారు ఇకపై తగిన మూత్రపిండాల అన్వేషణలో, ఎంపికలో ఎంతో ముఖ్యమైన పాత్ర నిర్వహించగలుగుతారు. మనదేశంలో మూత్రపిండాల మార్పిడి పద్ధతిలో ఈ రిజిస్ట్రీ, అనేక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుందని మా ప్రగాఢ విశ్వాసం’ డా. గంధే శ్రీధర్ చెబుతున్నారు.

ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ విధానం సులభతరమయి, మూత్రపిండాల మార్పిడి ప్రక్రియలో నైపుణ్యశిక్షణకు, రోగులకు లభిస్తున్న విస్తృత అవకాశాల వివరణకూ వీలు కలుగుతుంది. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డా. జ్యోత్స్న గుత్తికొండ, యం.బి.బి.ఎస్., యం.డి.; ఎబి, నెఫ్రాలజీ (యు.ఎస్.ఎ.), సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీస్ట్ & ట్రాన్స్ ప్లాంట్ ఫిజిషియన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ – నెఫ్రాలజీ & ట్రాన్స్ ప్లాంట్ – ‘రోగుల ఆరోగ్యరక్షణే పరమావధిగా పనిచేస్తున్న మాకు ఈ నూతన విధానాలు మరింత ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కలిగిస్తాయి’ అని డా. గంధే శ్రీధర్ అంటున్నారు. ‘సంప్రదాయమైన పద్ధతులకు భిన్నంగా సరికొత్త విధానాల గురించి యోచించటం, అందరికీ ఆరోగ్యాన్ని అందించే విశిష్టకృషిలో నిరంతరం నిమగ్నమయి ఉండటం స్టార్ హాస్పిటల్స్ విధానం. సత్వరమైన రీతిలో మార్పిడికి దోహదం కలిగించి, రోగులకు పూర్తి స్వస్థత చేకూర్చటంలో కీలకంగా ఉండటం మా ఆశయం’ అంటున్నారు డా. గోపీచంద్ మన్నం.

పి.కె.డి. ఎలా పనిచేస్తుంది?
ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో ఈ ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఒక జత (పెయిర్)లో – మూత్రపిండం కోరేవారు(1) ఏ బ్లడ్ గ్రూప్ లో ఉండి, దాత (2)- బి బ్లడ్ గ్రూప్ లో ఉన్నారనుకోండి. అలాగే, మరో జత (పెయిర్)లో – మూత్రపిండంకోరేవారు (3) బి బ్లడ్ గ్రూప్ లో ఉండి, దాత (4) ఏ గ్రూప్ వారనుకోండి. ఈ రెండుజతల మార్పిడిలో మొదటి జతలోని బి బ్లడ్ గ్రూప్ దాత (2), రెండో జతలోని బి బ్లడ్ గ్రూప్ ఉన్న మూత్రపిండాలు కోరే (3) వారికి.. అలాగే, రెండో జతలోని ఏ బ్లడ్ గ్రూప్ దాత(4) మొదటి జతలోని కోరే (1)వారికి మూత్రపిండాలను ఇవ్వవచ్చు. ఈ విధానంలో ఒకేసారి 2 మార్పిడి శస్త్రచికిత్సలు (ట్రాన్స్ ప్లాంట్స్) జరగాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని జతల మార్పిడిలనైనా చేయవచ్చు. దీన్ని ‘డోమినో కిడ్నీ పెయిర్డ్ ఎక్స్ఛేంజ్’ అంటారు. ఇలాగే, యాంటీబాడీస్ భిన్నంగా ఉన్న సందర్భాలలోనూ పెయిర్డ్ కిడ్నీ ఎక్స్ఛేంజ్లు సాధ్యమవుతాయి. ఇవన్నీ కూడా మూత్రపిండాలను ఇవ్వడానికి దాతలు సిద్ధంగా ఉన్నా.. మూత్రపిండాలు పొందేవారిలోని యాంటీబాడీస్, కిడ్నీల సైజు, డోనర్ వయసులనుకూడా దృష్టిలో ఉంచుకునే చెయ్యవలసిఉంటుంది. అలాగే.. అవయవాల మార్పిడి విషయంలో మనదేశంలో అమలులో ఉన్న ఇండియన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్, 2011 చట్టంలోని వివిధ నిబంధనలు, నియమాలకు లోబడి జరుగుతాయనీ, వీటితోబాటు, అనేక నైతిక సూత్రాలకు అనుబంధంగానే జరుగుతాయని గుర్తెరగాలి.

మార్పిడిలలో కొన్ని చిక్కులు
పైన పేర్కొన్న అనేక కారణాలవల్ల, దానం ద్వారా లభించగల మూత్రపిండాలలో మూడోవంతు ఏబిఓ ఇన్కంపాటబిలిటీ, డోనర్- స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనే ప్రతికూల అంశాలవల్ల పూర్తిగా వినియోగించ లేకపోతున్నారు. ‘ఏబిఓ ఇన్కంపాటబిలిటీ’ అంటే, మూత్రపిండాలు ఇచ్చేవారిలోనూ, మూత్రపిండాలను మార్పిడిద్వారా పొందగలిగే వారిలోనూ ఒకే రకమైన గ్రూప్ రక్తం ఉండకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది అన్నమాట. అంటే, ఏ-టైప్ రక్తం ఉన్నవారికి మూత్రపిండం అవసరం ఉంటే, వారికి ఏ-టైప్ రక్తం ఉన్నవారినుంచే మూత్రపిండం పొందగల వీలుండటం, మరే ఇతర టైప్ రక్తంగ్రూప్ ఉన్నా వారి మూత్రపిండాలు పనికిరాకపోవటం అన్నమాట. అయినా, ఈ రక్తగ్రూప్ వ్యత్యాసాలను పట్టించుకోకుండా, కొన్ని అధునాతన ప్లాస్మాఎక్స్ఛేంజ్ వంటి పద్ధతులతో, ట్రాన్స్ ప్లాంట్స్ అడపాదడపా జరుగుతున్నాయి. కానీ, ఈ పద్ధతులలో, కొన్నిచోట్ల మార్పిడి కూడా విఫలమవటం, శస్త్రచికిత్స తర్వాత మూత్రపిండాలు అందుకున్నవారిలో ఇన్ఫెక్షన్స్ రావటం గమనిస్తున్నాం’ అని వివరిస్తున్నారు స్టార్ హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ ప్లాంట్ డా. గంధే శ్రీధర్. అయితే, గత దశాబ్దకాలంలో కిడ్నీ పెయిర్డ్ డొనేషన్ విధానంవల్ల లివింగ్ కిడ్నీ డోనర్స్ అధికమయ్యారనీ వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ‘కిడ్నీ పెయిర్డ్ ఎక్స్ఛేంజ్’ లేదా ‘కిడ్నీ స్వాప్’ అనే పద్ధతిలో – ఇద్దరు లేదా అంతకుమించిన సంఖ్యలో ఉండే ‘ఏబిఓ ఇన్కాంపిటిబుల్ లివింగ్ డోనర్ రిసిపియెంట్’ల మధ్య మూత్రపిండాల మార్పిడికి వీలవుతుంది.