SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!

  • రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ
  • ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ సినిమా పనుల్లో జక్కన్న బిజీ..
Ss Rajamouli

Ss Rajamouli

SS Rajamouli Next Movie Hero: టాలీవుడ్ జక్కన్న, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ సరికొత్త చర్చ మొదలైంది. ఒక ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగా తన నెక్స్ట్ మూవీ ఊసెత్తని జక్కన్న, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా తన భవిష్యత్ ప్రణాళికలపై చిన్నపాటి హింట్స్ ఇస్తూ సినీ ప్రియుల్లో కాస్త ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ముగింపు దశకు ‘వారణాసి’

ప్రస్తుతం రాజమౌళి పూర్తి దృష్టి మహేష్ బాబుతో చేస్తున్న భారీ అడ్వెంచరస్ చిత్రం ‘వారణాసి’పైనే ఉంది. షూటింగ్ ప్రారంభం కావడం కాస్త ఆలస్యమైనప్పటికీ, జక్కన్న కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబుకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్స్ మినహా దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది.

అయితే షూటింగ్ ముగిసిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లకపోవచ్చు. భారీ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, గ్లోబల్ ప్రమోషన్లతో మరో ఆరు నెలల పాటు రాజమౌళి ‘వారణాసి’ పనుల్లోనే పూర్తిగా నిమగ్నమయ్యే అవకాశం ఉంది.

తెరపైకి రాజమౌళి – సూర్య కాంబో!

ఇదిలా ఉండగా.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సూర్యతో సినిమాపై రాజమౌళికి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. తామిద్దరం కలిసి పనిచేస్తే అది కచ్చితంగా చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చాలా కాలంగా వీరిద్దరి కలయికపై ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాజమౌళి నోటి నుంచే ఇలాంటి మాటా రావడంతో ఈ క్రేజీ కాంబో వార్తలకు మళ్లీ బలం చేకూరింది.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్య వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. పైగా ఆయనకు తెలుగుతో పాటు దక్షిణాది మార్కెట్‌పై బలమైన పట్టు ఉంది. వీరిద్దరూ చేతులు కలిపితే పాన్-ఇండియా స్థాయిలో మరో విజువల్ వండర్ ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘వారణాసి’ తర్వాత నిజంగానే రాజమౌళి తన తర్వాతి కథను సూర్యతో పట్టాలెక్కిస్తారా.? లేక ఇది కేవలం ప్రాథమిక చర్చల వరకేనా..? అనేది తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.