Site icon NTV Telugu

Srisailam : శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ దగ్గర ప్రమాదం

Srisailam Tunnel

Srisailam Tunnel

Srisailam : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది. గమనించదగిన విషయం ఏమిటంటే, ఈ టన్నెల్‌లో నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు పనులు ప్రారంభమయ్యాయి. అయితే, ఎంతో త్వరగా ఈ ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టన్నల్ బోర్ మెషిన్‌తో డ్రిల్లింగ్ జరుగుతుండగా, లోపల పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 Amaravati: అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం.. ఎప్పటినుంచంటే..!

ప్రమాదం జరిగిన క్షణాల్లో టన్నెల్ లోపల పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడంతో సమీపంలోని కార్మికులు అప్రమత్తమై లోపలికి పరుగెత్తారు. అప్పటికే పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రభుత్వం టన్నెల్ నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఇంజినీర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఏడాదిలోపు పనులు ముగియాలన్న లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. అయితే, ఇలాంటి తక్షణ ప్రాజెక్ట్‌లలో పనుల నాణ్యతను విస్మరించడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై వారు సమగ్ర విచారణ చేపట్టారు. పనుల్లో ఎక్కడ తప్పుదొర్లిందో అంచనా వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రమాదం తర్వాత టన్నెల్ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో భయం నెలకొంది. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించకుండా పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రమాదానికి దారితీసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు కూడా భద్రతా చర్యల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఈ ప్రమాదానికి నిజమైన కారణం ఏంటనే దానిపై త్వరలో స్పష్టత రానుంది.

 Vijayawada: యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ.. 10 మంది మహిళలు అరెస్ట్

Exit mobile version