NTV Telugu Site icon

Hirunika Premachandra : నా రొమ్ములంటే నాకు గర్వం..

Hirunika Premachandra

Hirunika Premachandra

నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాన్న శ్రీలంక మాజీ ఎంపీ హిరుణికా ప్రేమచంద్ర వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి. నిజానికి, ఏ స్త్రీ తన వక్షోజాల గురించి బాహాటంగా అలా మాట్లాడదు. అలా మాట్లారంటే తప్పకుండా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది. హిరుణికా విషయంలో కూడా కారణం ఉంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న హిరుణికాను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సయమంలో ఆమె స్తనాలు బయటకు కనిపించాయని కొందరు ఎగతాళి చేశారు. సోషల్ మీడియాలో వెకిలి చేష్టలకు తెగబడ్డారు. మీమ్స్ క్రియేట్ చేసి రాక్షసానందం పొందారు. దాంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. తన శరీరం గురించి మాట్లాడుతున్న వారికి సమాధానంగా హిరుణికా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు. నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను. ముగ్గురు అందమైన పిల్లలకి పాలిచ్చి పెంచాను. వాళ్లను జాగ్రత్తగా పెంచి పోషించాను. నా శరీరం మొత్తాన్ని వాళ్లకు అంకితమిచ్చాను. నా రొమ్ములు బయటకు కనిపించడం గురించి ఎగతాళి చేసేవారు కూడా పసిపిల్లలుగా ఉన్నపుడు తమ తల్లి చనుబాలు తాగే ఉంటారు. ఏమైనా, మీరు నా రొమ్ముల గురించి మాట్లాడటం , మీమ్స్ తయారుచేసి నవ్వుకునే లోపల క్యూలో మరొక శ్రీలంక పౌరుడు మరణించి ఉంటాడని తెలుసుకోండి అంటూ హిరునికా తన ఆవేదన వ్యక్తం చేసింది.

హిరుణికా పోస్ట్‌కు నెటిజన్ల నుంచి ..ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆమె ఒక అద్భుతమైన ధైర్యవంతురాలని కొనియాడారు. అనైతికమైన, అసభ్యకరమైన మనుషులు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేస్తారని అస్సలు చింతించకండని..తాబు మీతో ఉన్నామన్నారు. మీరు మరింత బలంగా ఉండండని ధైర్యం ఇచ్చారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటి దగ్గర యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్- UPF మహిలలు నిరసనలకు దిగారు. ఈ నిరసనలో పాల్గొన్న హిరుణికా ప్రేమచంద్ర పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరసనకారులు ప్రధాని ఇంట్లోకి చొరబడకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఐతే, పోలీసు వలయాన్ని చేదించేందుకు ఆమె ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంలో తీసిన ఫొటోలను కొందరు సోషల్ మీడియలో పెట్టి ఆమె రొమ్ముల గురించి అసభ్యకరంగా కామెంట్‌ చేశారు. హిరుణికా ప్రేమచంద్ర రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ప్రముఖ రాజకీయ నేత భరత్ లక్ష్మణ్ ప్రేమచంద్ర కుమార్తె. 2011లో స్థానిక ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆమె తండ్రి హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన వారిని కోర్టు ముందుకు తీసుకొచ్చేందుకు హిరుణికా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తండ్రి హత్య తరువాత శ్రీలంక రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ మహిళా రాజకీయ నాయకురాలిగా ఎదిగారు.2015 ఎన్నికల్లో యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో యుపీఎఫ్ఎ తరుపున పోటీ చేసి ఓడిపోయినా.. శ్రీలంక రాజకీయల్లో ఆమె ఆగ్రశేణి నేతగా కొనసాగుతున్నారు.

శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో పాలకవర్గాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. రాజపక్ష కుటుంబంతో పాటు రణిల్ విక్రమసింఘెకు వ్యతిరేకంగా కూడా ఆమె ఆందోళన చేస్తున్నారు. మరోవైపు, హిరుణికా విషయంలో నెటిజన్ల తీరును ప్రధాని రణిల్‌ తీవ్రంగా తప్పుపట్టారు. నాగరిక సమాజం మాతృత్వాన్ని అవమానించకూడదని అన్నారు. ముగ్గురు పిల్లల తల్లయిన హిరుణికాను అవమానించేలా ఫోటోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నిరసనలు ప్రజాస్వామ్య రాజకీయాల్లో భాగమని .. సిద్ధాద్ధంతపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిపై చర్చించుకోవాలే తప్ప వ్యక్తిత్వ హత్యకు పాల్పడకూడదన్నారు శ్రీలంక ప్రధాని. గత నెలలో రణిల్‌ ప్రధాని పదవి చేపట్టంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం సద్దుమణిగింది. కానీ ఆర్థిక సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఆహార సంక్షోభం అంతకంతకు తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రజలు ఒక్క పూట కూడా తినలేని దుర్భర స్థితిలోకి నెట్టివేయబడ్డారు. పెట్రోల్‌, డీజీల్‌ కోసం బంకుల ముందు రోజుల తరబడి ‘క్యూ’లోనే నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ‘క్యూ’లో నే ప్రాణాలు వదులుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పది మంది అలా చనిపోయారు. ఇది శ్రీలంక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చూపిస్తోంది.

పెట్రోల్‌ బంకులతోపాటు నిత్యావసర వస్తువుల కోసం గంటలు, రోజుల తరబడి నిలబడడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాబోవు రోజుల్లో ఇంధన కొరత మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున పంపిణీపై ప్రభుత్వం పరిమితి విధించనుంది. ఏదేమైనా, శ్రీలంక పాలకులు చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి 10 కుటుంబాలలో తొమ్మిది ఆకలితో అలమటిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి నివేదికలు అంటున్నాయి. దేశ అర్థవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే పార్లమెంటులోనే ప్రకటించారు. అంతేకాదు, భవిష్యత్తు పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో తమను ఆదుకునేది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాత్రమేనని పార్లమెంటుకు చెప్పారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రమాదకర స్థితిని మించి పడిపోయాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కూడా కొనలేని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అంత సులువు కాదని తేల్చిచెప్పారు. గత 75 ఏళ్లలో శ్రీలంక ఏనాడూ ఇంతటి దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. 2026 నాటికి లక్షా 95 వేల 507 కోట్ల రూపాయల రుణాలు చెల్లించాలి. విదేశీ రుణ భారం మూడు లక్షల 98 వేల 835కోట్ల రూపాయలకు చేరింది. జులై చివరి నాటికి ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదురుతుందని శ్రీలంక ప్రధాని ఆశిస్తున్నారు. అప్పటి వరకు లంక ప్రజలు ఈ కష్టాలు భరించాల్సిందే.. మరో మార్గం లేదు!!

 

Show comments