NTV Telugu Site icon

ZIM vs SL: చివరి ఓవర్లో మాథ్యూస్‌ చెత్త బౌలింగ్‌.. శ్రీలంక‌పై జింబాబ్వే స్ట‌న్నింగ్ విక్ట‌రీ!

Angelo Mathews

Angelo Mathews

Angelo Mathews Gives 24 Runs in 5 Balls in Last Over: శ్రీలంకకు పసికూన జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే ఊహించని విజయాన్ని అందుకుంది. సీనియర్ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ లంక ఓటమికి కారణమయ్యాడు. చివరి ఓవర్‌లో ఏకంగా 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో స‌మంగా ఉంది. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చరిత్‌ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (51 బంతుల్లో 66 నాటౌట్‌, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లంక బ్యాటర్లలో పాతున్ నిస్సంక (1), కుశాల్‌ మెండిస్‌ (4), కుశాల్‌ పెరీరా (0), సమరవిక్రమ (16), దాసున్ షనక (9) పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్‌ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 174 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే చివరి ఓవర్‌లో లూక్ జాంగ్వే మెరుపులు (25 నాటౌట్‌; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. క్రెయిగ్‌ ఎర్విన్‌ (70) హాఫ్ సెంచరీ చేయగా.. బ్రియాన్‌ బెన్నెట్‌ (25) పర్వాలేదనిపించాడు. సికందర్‌ రజా (8) ఐదు మ్యాచ్‌ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో క్లైవ్‌ మదండే (15 నాటౌట్‌) సాయంతో జాంగ్వే జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: Finn Allen Century: ఫిన్‌ అలెన్‌ ఊచకోత.. 16 సిక్స్‌లతో సెంచరీ! ప్రపంచ రికార్డు సమం

చివ‌రి ఓవ‌ర్‌లో జింబాబ్వే 20 ర‌న్స్ చేయాల్సి ఉంది. చివ‌రి ఓవ‌ర్ తొలి బంతిని జాంగ్వే సిక్స‌ర్ బాదాడు. ఆ బంతి నో కూడా. దీంతో ఆరు బంతుల్లో టార్గెట్ 13 ర‌న్స్‌గా మారింది. ఫ్రీ హిట్ బంతికి ఫోర్, ఆ త‌ర్వాత బంతికి జాంగ్వే సిక్స‌ర్ కొట్టాడు. దాంతో చివ‌ర‌కు 4 బంతుల్లో మూడు రన్స్ అవసరం అయ్యాయి. మూడో బంతికి ప‌రుగు రాలేదు. నాలుగో బంతికి జాంగ్వే క్యాచ్ డ్రాప్ కాగా.. ఒక ప‌రుగు వ‌చ్చింది. అయిదో బంతిని క్లైవ్ మ‌దాండే సిక్స‌ర్‌గా మ‌లిచాడు. దాంతో మరో బంతి ఉండగానే జింబాబ్వే విజయాన్ని అందుకుంది.