NTV Telugu Site icon

Sri Lanka Cricket Board: భారత్‌ చేతిలో ఘోర పరాభవం.. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు!

Sri Lanka

Sri Lanka

Sri Lanka Cricket Board suspended ahead of BAN vs SL Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచకప్‌ 2023లో వరుస ఓటములు, భారత్‌ చేతిలో ఘోర పరాభవం మరియు ఇతర కారణాల నేపథ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్ఎల్‌సీబీ)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక కమిటీకి లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నాయకత్వం వహిస్తారని చెప్పారు. బోర్డు కార్యదర్శి మోహన్ డి సిల్వా శనివారం రాజీనామా చేయగా.. ఆ మరుసటి రోజే క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

శ్రీలంక క్రీడల మంత్రి రోషన్‌ రణసింగే మాట్లాడుతూ… ‘శ్రీలంక బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే హక్కు లేదు. అందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేది. ఎస్ఎల్‌సీబీలో అవినీతి మితి మీరింది. అందుకే బోర్డును తొలగించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’అని తెలిపారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా బోర్డు అధికారుల ప్రవర్తన కూడా రద్దుకు ఓ కారణం అని తెలుస్తోంది.

Also Read: Mahadev Betting APP: సీఎంకు రూ. 508 కోట్లు ఇచ్చా.. మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ఓనర్‌ వీడియో వైరల్!

ప్రపంచకప్‌ 2023లో ఘోర ఓటములతో శ్రీలంక బోర్డుపై విమర్శలు రావడంతో.. ఎస్ఎల్‌సీబీ కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భారతదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ 2023లో లంక ప్రదర్శనపై ఆ జట్టు ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు ప్రదర్శన, బోర్డులో అవినీతి కారణంగా క్రీడా మంత్రిత్వ శాఖ తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భారత్‌ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.