మైదానంలో క్లిష్ట సమయాల్లో ఎలా ఉండాలో తన మెంటార్ ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకొన్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మన చేతుల్లో లేనివాటి గురించి ఆలోచించడం అనవసరమన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడం సంతోషం కలిగించిందన్నాడు. శార్దూల్ ఠాకూర్ అద్భుతం అని పంత్ ప్రశంసించాడు. గురువారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘ఊరట కలిగించే ఫలితం ఇది. టీమ్ వర్క్ మీద ఎప్పుడూ దృష్టి పెడతాం. విజయం సాధించినప్పుడు పొంగిపోం, ఓడినప్పుడు కుంగిపోము. మన చేతుల్లో లేని, మనం నియంత్రించలేని వాటిపై ఆలోచించం. నా మెంటార్ ఎంఎస్ ధోనీ నుంచి ఇదే నేర్చుకున్నా. మన కంట్రోల్‌లో ఉన్న వాటిపైనే దృష్టిపెట్టమని మహీ భాయ్ చెప్పాడు. అదే చేస్తున్నా. ప్రిన్స్ బౌలింగ్ చేసిన విధానం ఆనందంగా ఉంది. శార్దూల్ ఠాకూర్ అద్భుతం. నికోలస్ పూరన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపించడంలో ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. అతడికి మరింత స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నాం. దూకుడుగా ఆడేటప్పుడు ప్రోత్సాహం ఇవ్వాలి. మేము అత్యుత్తమంగా ఆడలేదు కానీ.. విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.