Site icon NTV Telugu

Rammohan Naidu: శ్రీకాకుళం రైల్వే ప్రయాణీకుల కష్టాలకు చెక్.. ఫలించిన మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి!

Rammohan Naidu

Rammohan Naidu

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణీకులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు హాల్టుల సమస్యకు పరిష్కారం లభించింది. మూడు ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువ రైల్వే స్టేషన్లలో హాల్టులు మంజూరయ్యాయి. ఇకపై బెర్హంపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18525/18526) తిలారు స్టేషన్‌లో ఆగనుంది. అలాగే పూరి–అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌ (12843/12844) ఇచ్చాపురం స్టేషన్‌లో, భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (22819/22820) బారువ స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రయాణీకులకు ఎంతో సౌకర్యం కలగనుంది.

READ MORE: Cyberabad Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!.. ఈ నంబర్‌కి సమాచారం ఇవ్వండి..

ఈ ప్రత్యేక హాల్టుల అంశాన్ని గతంలోనే రైల్వే సమీక్ష సమావేశాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా ప్రజల అవసరాలను వివరించి, హాల్టులు తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆయన కృషికి ఫలితంగా రైల్వే శాఖ నుంచి సానుకూల నిర్ణయం వెలువడింది. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, జిల్లావాసులు మంత్రి చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే హాల్టుల మంజూరుతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మరో అడుగు ముందుకేసినట్టయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

READ MORE: Realme 16 Pro 5G Launch: రియల్‌మీ ‘బాహుబలి’ ఫోన్ వచ్చేస్తోంది.. 2 రోజుల పాటు ఛార్జర్‌ అవసరం లేదు!

కాగా.. “శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం ఉపయోగపడేలాగా నేడు రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు చేశారు. ప్రజా ప్రయోజనాన్ని ప్రధానంగా తీసుకుని, ఈ అంశంపై నేను ఎంతోకాలంగా నిరంతరం కృషి చేస్తున్నాను. సానుకూల స్పందన ఇచ్చి సహకరించిన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కి, అలాగే రైల్వే అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నిర్ణయం శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు.” అని మంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు.

Exit mobile version