Site icon NTV Telugu

YSRCP Rebel MLAs: వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల వినతి.. తిరస్కరించిన స్పీకర్.. నోటీసులు జారీ

Ysrcp Rebel Mlas

Ysrcp Rebel Mlas

YSRCP Rebel MLAs: అనర్హత పిటిషన్లపై రిప్లై ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేల వినతిని తిరస్కరించారు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. ఈ మేరకు నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించింది స్పీకర్ పేషీ.. 30 రోజుల సమయం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు స్పీకర్. నోటీసులతో పాటు అటాట్‌మెంట్లుగా ఇచ్చిన పేపర్, వీడియో క్లిప్పింగుల ఒరిజనల్ కాపీలను వాట్సాప్ ద్వారా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు పంపామని స్పీకర్ పేషీ వెల్లడించింది.. అంతేకాదు.. అనర్హత పిటిషన్లపై ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నోటీసులు జారీ చేసింది.. వైసీపీ రెబెల్స్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి మరోసారి నోటీసులు జారీ చేశారు.

Read Also: Bonda Uma: మాకేం ఇబ్బంది లేదు.. మేం 2 సీట్లు ప్రకటిస్తే.. పవన్ 2 సీట్లు ప్రకటించారు ..

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా విచారణకు రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చిన విషయం విదితమే.. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుందని.. ఈ రోజు ఉదయం పూట విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం సమయంలో విచారణకు రావాల్సిందిగా టీడీపీ రెబెల్స్‌కు నోటీసులు జారీ చేసింది స్పీకర్‌ కార్యాలయం.. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ రాసిన విషయం విదితమే.. తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. ఇక, తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.. తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని.. వాటిని పరిశీలించేందుకు 4 వారాల గడువు కూడా ఇవ్వాలంటూ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. కానీ, వారి విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్‌.. 29న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.

Exit mobile version