SP Charan Birthday special: గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వారసుడు యస్.పి.చరణ్ సైతం నాన్న బాటలోనే పయనిస్తున్నారు. గాయకునిగా, నటునిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా, సంగీతకళాకారుల పోటీలో న్యాయనిర్ణేతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు బాలు. ఆయన చూపిన దారిలోనే చరణ్ సైతం సాగుతున్నారు. ఇప్పటికే నటునిగా, గాయకునిగా, నిర్మాతగా అలరించిన చరణ్, తన తండ్రిలాగే పాటల పోటీలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. మునుముందు మరిన్ని ప్రక్రియల్లోనూ తన బాణీ పలికించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొనే దిశగా చరణ్ అడుగులు వేస్తున్నారు.
యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి దంపతులకు 1972 జనవరి 7న చెన్నైలో జన్మించారు చరణ్. ఆయన అక్క పల్లవి కూడా తండ్రిలాగే గానంతో సాగారు. మద్రాసులోని అసన్ మెమోరియల్ సీబీఎస్ఈ స్కూల్ లో చరణ్ చదివారు. చదువుకొనే రోజుల్లో చరణ్ కు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మంచి మిత్రుడు. న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీలో చరణ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఫిలిమ్ అండ్ టెలివిజన్ మేకింగ్ కోర్సునూ చరణ్ అభ్యసించారు. చిన్నతనం నుంచీ చుట్టూ సినిమా వాతావరణం ఉండడం వల్ల చరణ్ మనసు సైతం చిత్రసీమవైపే పరుగు తీసింది. 1982లోనే తండ్రితో కలసి భాగ్యరాజా “డార్లింగ్… డార్లింగ్… డార్లింగ్…” చిత్రంలో తొలిసారి గళం వినిపించారు చరణ్. తరువాత అనేక తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో పాటలు పాడారు. ఈ మధ్య కాలంలో ‘అఖండ’ చిత్రంలో ఎస్పీ చరణ్ పాడిన “అడిగా అడిగా…” పాట మంచి ఆదరణ పొందింది. గత సంవత్సరం విడుదలైన ‘సీతా రామమ్’లోని “ఓ సీతా…”, “ఇంతందం…” అంటూ సాగే పాటల్లోనూ చరణ్ గానం జనాన్ని ఆకట్టుకుంది.
తండ్రి బాటలోనే పయనిస్తూ 1996లోనే ‘నెక్ట్స్ జనరేషన్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరంభించారు చరణ్. అందులో ఆయన బాల్య మిత్రులు వెంకట్ ప్రభు, ప్రేమ్ జి.అమరన్, థమన్, యుగేంద్రన్ సభ్యులుగా ఉన్నారు. తరువాత 1999లో ‘మహా ఎడబిడగి’ అనే కన్నడ చిత్రం ద్వారా నటునిగా మారారు చరణ్. తెలుగులో “నాలో, మూడుముక్కల్లో చెప్పాలంటే” అనే చిత్రాల్లో నటించారు చరణ్. తమిళ చిత్రాల్లో ఎక్కువగా కనిపించారు. నటనలో అడుగు పెట్టిన కొన్నాళ్ళకే చరణ్ నిర్మాతగానూ మారారు. తన మిత్రుడు వెంకట్ ప్రభుతో కలసి నటిస్తూ ‘ఉన్నై చరణదైనందేన్’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత తెలుగులో విజయం సాధించిన ‘వర్షం’ను జయం రవి హీరోగా ‘మలై’ పేరుతో రీమేక్ చేశారు చరణ్. తమిళంలోనే మరో ఏడు చిత్రాలు నిర్మించారు.
నాన్న బాటలోనే అంటూ అనేక టీవీ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నారు చరణ్. యస్పీ బాలు చేయని పనిని చరణ్ ఏదైనా చేశారంటే అది దర్శకత్వం వహించడం. ‘అధిగారం’ అనే పది ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ను రూపొందించారు. అది త్వరలోనే వెలుగు చూడనుంది. ప్రస్తుతం గాయకునిగా సాగుతూనే తండ్రి ‘బ్రెయిన్ చైల్డ్’గా వెలసిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమానికి చరణ్ వ్యాఖ్యాతగా ఉన్నారు. బాలు లాగా న్యాయనిర్ణేతగా కాదు కానీ, హోస్ట్ గా చరణ్ తనదైన పంథాలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాలు వారసునిగా చరణ్ జనం మదిలో పదిలమైన స్థానం సంపాదిస్తారని ఆశిద్దాం.