NTV Telugu Site icon

Floods In Spain: వరదల బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు.. పట్టాలు తప్పిన రైలు

Spain Floods

Spain Floods

Floods In Spain: దక్షిణ, తూర్పు స్పెయిన్ మంగళవారం వినాశకరమైన వరదలను ఎదుర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లో రికార్డు స్థాయిలో 12 అంగుళాల వర్షం కురిసింది. కుండపోత వర్షం విస్తృతమైన విధ్వంసానికి దారితీసింది. భారీ వర్షాల కారణంగా తూర్పు ప్రాంతంలో ఉన్న వాలెన్సియాలో వరదలు సంభవించాయి. భారీ వరదల కారణంగా రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మురికి నీరు వీధుల్లోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే మరోవైపు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షం కురిసింది. వరద బాధితులను రక్షించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో బాధితులను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. స్పెయిన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.

Read Also: Diwali At Ayodhya: 500 ఏళ్ల తర్వాత నేడు అయోధ్యలో దీపావళి సంబరాలు.. ఏకంగా 28 లక్షల దీపాలతో

భారీ వర్షం, వరదల కారణంగా.. రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. వాలెన్సియా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన 12 విమానాలను స్పెయిన్‌ లోని ఇతర నగరాలకు మళ్లించినట్లు స్పానిష్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరో పది విమానాలను రద్దు చేశారు. రైళ్లను కూడా రద్దు చేశారు. వరదల కారణంగా.. మాడ్రిడ్ – అండలూసియా హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 276 మంది ప్రయాణికులు ఉన్నారు. భారీ వర్షాలపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తుపాను కారణంగా గల్లంతైన వ్యక్తులు, ఆస్తి నష్టం గురించి ఆయన ఆందోళన చెందారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండాయి. భారీ వరదల కారణంగా వీధుల్లో పార్క్ చేసిన కార్లు చాలా చోట్ల నీటిలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments