Site icon NTV Telugu

South Korea Protests: చైనాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో నిరసనలు.. హెచ్చరించిన అధ్యక్షుడు!

South Korea Protests

South Korea Protests

South Korea Protests: దక్షిణ కొరియాలో చైనాకు వ్యతిరేకంగా యువత వీధుల్లో వచ్చి నిరసనలు తెలిపారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక (APEC) శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు దక్షిణ కొరియాలో జరగనుంది. ఈ సమావేశంలో అమెరికా, చైనా, రష్యా, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా నాయకులు పాల్గొంటారు. ఈక్రమంలో శిఖరాగ్ర సమావేశానికి ముందు రాజధాని సియోల్‌లో చైనా, జి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. “చైనా అవుట్,” “కమ్యూనిస్టులు అవుట్”, “కొరియా కొరియన్లకు మాత్రమే” వంటి నినాదాలు నిరసనకారుల నుంచి వినిపించాయి.

READ ALSO: old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు..

చైనీస్ కమ్యూనిటీ లక్ష్యంగా కొరియన్ల నిరసనలు..
చైనా వ్యతిరేక నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. నిరసనకారులు దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారని అన్నారు. ఈ నిరసనలు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. గత కొన్ని నెలలుగా దేశంలోని సియోల్, ఇతర నగరాల్లో చైనా వ్యతిరేక ర్యాలీలు తీవ్రమయ్యాయి. నిరసనకారులు చైనా దుకాణాలు, కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని చోట్ల వారు చైనా ప్రజల నుంచి గుర్తింపు కార్డులను కూడా డిమాండ్ చేశారు, అలాగే చైనీస్ రెస్టారెంట్లు లేదా దుకాణాల వెలుపల నిరసనలు తెలిపారు.

నిరసనల వెనుక అసలు కారణాలు ఏంటి?
ఈ నిరసనల వెనుక అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియా – చైనా మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్నాయి. వాటిలో అక్రమంగా చైనా చేపలు పట్టడం, సాంస్కృతిక వివాదాలు, దక్షిణ కొరియాలో US క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించినందుకు చైనా ఆర్థిక ప్రతీకారం వంటివి ఉన్నాయి. అయితే ఈ సమస్యలను ఇప్పుడు దక్షిణ కొరియా మితవాద సమూహాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని అధికార వర్గాలు విమర్శించాయి. దక్షిణ కొరియా రాజకీయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందని మాజీ అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ 2024లో పేర్కొన్నారు. అనంతర కాలంలో ఆయన మద్దతుదారులు కమ్యూనిస్ట్ చొరబాటును ఆరోపిస్తూ దేశంలో విశేషంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. యూన్ కూడా మార్షల్ లా విధించడానికి ప్రయత్నించాడు, కానీ అది విఫలమైంది.

దక్షిణ కొరియాలో చైనీయులకు స్పెషల్ సౌకర్యం
ప్రభుత్వం ఇటీవల చైనా పర్యాటకులకు వీసా రహిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ప్రభుత్వం చెబుతుంది. కానీ నిరసనకారులు ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని చెబుతున్నారు. నిరుద్యోగంతో పోరాడుతున్న కొరియా యువత.. దేశంలో చైనా ప్రతిదీ నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో జరిగిన ఒక సర్వే ప్రకారం.. చైనా పట్ల ప్రతికూల భావన 2015లో 16% ఉండగా, 2025 నాటికి 71%కి పెరిగిందని వెల్లడించింది. దేశంలో తాజా నిరసనల కారణంగా చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ఇటువంటి నిరసనలను కఠినంగా అణచివేయాలని, విదేశీ పౌరుల భద్రత కల్పించాలని అధ్యక్షుడు లి పోలీసులను ఆదేశించారు.

READ ALSO: old woman: వీళ్లు అసలు మనిషులేనా.. తల్లి అంతక్రియలకు రాని కొడుకులు..

Exit mobile version