Site icon NTV Telugu

SA vs Ban: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రిలీ రోసో

South Africa

South Africa

SA vs Ban: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 205 భారీ స్కోరును చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 16.3 ఓవర్లు ఆడి 101 పరుగులకే ఆలౌట్‌ అయింది. సఫారీ జట్టు 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రిలీ రోసో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా రోసోకు అంతర్జాతీయ టీ20లలో ఇది వరుసగా రెండో సెంచరీ. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరి టీ20లో అతడు 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు అత్యంత వేగంగా ప్రపంచకప్‌లో శతకం బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు క్రిస్‌ గేల్‌, బ్రెండన్‌ మెకల్లమ్ ఉన్నారు. వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ కూడా 38 బంతుల్లో 63 పరుగుల భారీ స్కోరును నమోదు చేశాడు.

Elon Musk: ఎలాన్‌ మస్క్‌ ఇక ట్విట్టర్‌ చీఫ్‌..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..

బంగ్లాదేశ్‌ బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. బౌలర్లందరీని రూసో చీల్చి చెండాడాడు. దక్షిణాఫ్రికా కేవలం 5 వికెట్లను కోల్పోయి భారీ స్కోరును సాధించింది. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబుల్ హసన్‌ మాత్రమే 2 వికెట్లు పడగొట్టగా.. టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఆఫిఫ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 206 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్‌కు బంగ్లాదేశ్‌ ఏ దశలోనూ దక్షిణాఫ్రికాకు పోటీని ఇవ్వలేకపోయింది. లిట్టన్‌ దాస్‌ 34 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారెవరు సఫారీల వేగానికి నిలబడలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు అనిరిచ్‌ నోర్జే 4వికెట్లు పడగొట్టగా.. తబ్రెయిజ్ షంసీ 3 వికెట్లు పడగొట్టాడు. కాగిసో రబాడ, కేశవ్ మహారాజ్‌ తలో వికెట్‌ తీశారు.

Exit mobile version