వన్డే ప్రపంచకప్ 2003కి ఎంపిక చేయకపోవడంతో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తనతో 3 నెలలు మాట్లాడలేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. లక్ష్మణ్ చాలా నిరాశకు గురయ్యాడని, కొన్ని రోజుల తర్వాత అతనితో రాజీ చేసుకున్నా అని చెప్పారు. ప్రపంచకప్ ముగిసాక భారత జట్టు ప్రదర్శన పట్ల లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడని దాదా పేర్కొన్నారు. ప్రపంచకప్ 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్.. రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా గంగూలీ వ్యవహరించారు. అద్భుత కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో దాదా భారత జట్టును ఫైనల్‌కు తీసుకొచ్చారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… ‘2003 వన్డే ప్రపంచకప్‌కి ఎంపిక చేయకపోవడంతో వీవీఎస్ లక్ష్మణ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పుడు ఇలాగే జరిగింది. ప్రపంచకప్‌లో అవకాశం దక్కకపోవడంతో లక్ష్మణ్ నాతో 3 నెలలు మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత అతనితో రాజీ చేసుకున్నా. మెగా టోర్నీకి దూరమైనప్పుడు ఏ ఆటగాడికైనా నిరాశ సహజమే. లక్ష్మణ్ లాంటి మంచి నైపుణ్యమున్న ఆటగాడు నిరాశ చెందడంలో అర్థం ఉంది. అయితే టోర్నీ ముగిశాక ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శనపై లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ అనంతరం లక్ష్మణ్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు. మేము మొదటిసారి పాకిస్తాన్‌లో సిరీస్ గెలిచాము, లక్ష్మణ్ కీలక పాత్ర పోషించాడు’ అని చెప్పారు.
Also Read: Sourav Ganguly: రాజకీయాలపై ఆసక్తి లేదు.. ఆ పదవికి మాత్రం సిద్ధం!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అంతర్జాతీయ కెరీర్ బాగా సాగింది. వన్డే కంటే టెస్ట్ క్రికెట్‌లో అతడి రికార్డులు బాగున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో లక్ష్మణ్ తనడైన ముద్ర వేశారు. 134 టెస్ట్ మ్యాచ్‌లలో 8781 రన్స్ చేశారు. 86 వన్డే మ్యాచ్‌లలో 2338 పరుగులు బాదారు. దిగ్గజ బ్యాట్స్‌మన్ లక్ష్మణ్ ఎప్పుడూ ప్రపంచకప్‌లో ఆడలేదు. 2003 ప్రపంచకప్‌లో అతడి స్థానంలో దినేష్ మోంగియాను ఎంపిక చేశారు. అప్పటికి వన్డేల్లో 27.55 సగటు, 67.02 స్ట్రైక్ రేట్‌తో 1240 పరుగులు మాత్రమే చేయడంతో లక్ష్మణ్‌కు నిరాశ తప్పలేదు. అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాల కారణంగా మోంగియాకు జట్టులో స్థానం దక్కింది. అయితే లక్ష్మణ్ బదులుగా ఎంపికైన మోంగియా మెగా టోర్నీలో పేలవ ప్రదర్శన చేశారు.
