టీమిండియా మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో అద్భుతంగా ఆడిందని కొనియాడారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టమని, తీవ్ర ఒత్తిడిలో కూడా తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేసిందన్నారు. రిచాకు 22 ఏళ్లే అని, ఎంతో భవిష్యత్ ఉందన్నారు. రిచా.. ఏదో ఓరోజు భారత కెప్టెన్ కావాలని తాను ఆశిస్తున్నట్లు గంగూలీ చెప్పారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులోని సభ్యురాలైన రిచాను సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సన్మానించాయి. ఈ కార్యక్రమానికి దాదా హాజరయ్యారు.
‘మీ (రిచా ఘోష్) కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది. రాబోయే 4-6 సంవత్సరాలలో మహిళా క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది. మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒక రోజు ఝులన్ గోస్వామి లాగా.. మేము ఇక్కడ నిలబడి ‘రిచా భారత కెప్టెన్’ అని చెబుతాము. మీకింకా 22 ఏళ్లే, ఎంతో భవిష్యత్ ఉంది. హృదయపూర్వక అభినందనలు చెబుతున్నా. లోయర్ ఆర్డర్‌లో ఆడటం చాలా కష్టం. కానీ రిచా తక్కువ బంతుల్లోనే ఎక్కువ రన్స్ చేశారు. అందరూ సెమీ ఫైనల్‌లో జెమీమా రోడ్రిగ్స్ (127), హర్మన్‌ప్రీత్ (89) ఇన్నింగ్స్‌లనే గుర్తుంచుకుంటారు. 130 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో రిచా చేసిన రన్స్ చాలా చాలా విలువైనవి’ అని సౌరవ్ గంగూలీ అన్నారు.
Also Read: WPL 2026: డబ్ల్యూపీఎల్‌లో ఆడేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రయత్నాలు.. ఆర్‌సీబీ కిట్ బ్యాగ్‌తో అనయ!
ప్రపంచకప్ గెలిచిన మొదటి బెంగాల్ క్రికెటర్ రిచా ఘోష్. 2003లో సౌరవ్ గంగూలీ ఆ అవకాశాన్ని కొద్దిలో కోల్పోయారు. ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ భారీ తేడాతో ఓడిపోవడంతో దాదా ప్రపంచకప్ గెలవలేకపోయారు. రిచాను శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో సీఎం మమత బెనర్జీ సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యుత్తమ పౌర అవార్డు ‘బంగ భూషణ్’ను ప్రదానం చేశారు. డీఎస్పీగా నియమిస్తూ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్లో 34 పరుగులకు గుర్తుగా.. రూ.34 లక్షల నగదు బహుమతిని కూడా ప్రభుత్వం రిచాకు బహూకరించింది.
