వెండితెరపై విలన్‌గా అలరించిన సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆపద్బాంధవుడిగా మారి రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన తన ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ ద్వారా ఒక గొప్ప కార్యాన్ని పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న 500 మంది పేద మహిళలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. ఈ సందర్భంగా సోనూసూద్ స్పందిస్తూ.. ‘500 మంది తల్లులు, సోదరీమణులు కొత్త జీవితాన్ని పొందడం, వారి కుటుంబాల్లో ఆనందం నిండటం నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను’ అని తెలిపాడు.
Also Read : Pradeep: మళ్ళీ డైరెక్షన్ చేయబోతున్న హీరో!
ఇక కరోనా కష్టకాలంలో వేలాది మంది వలస కూలీలను సొంతూళ్లకు పంపడం ద్వారా వెలుగులోకి వచ్చిన సోనూసూద్ సేవా గుణం, ఆ తర్వాత ఏమాత్రం తగ్గలేదు. అప్పటి నుంచి నేటి వరకు వైద్యం, చదువు, ఉపాధి వంటి రంగాల్లో ఎంతో మంది బాధితులకు ఆయన అండగా నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సాయం కోరితే, వెంటనే స్పందించి పరిష్కారం చూపే ఆయన శైలికి యావత్ దేశం ఫిదా అవుతోంది. తాజాగా క్యాన్సర్ బాధితులకు చేసిన ఈ సహాయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి భరోసా ఇస్తూ, తన ఫౌండేషన్ ద్వారా నిరంతరం కష్టపడే సోనూసూద్ మరియు ఆయనకు సహకరించిన వైద్య బృందానికి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తున్నారు.
