కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తన రాబోయే ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ వేదికగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో తన తొలి పరిచయం, ప్రేమకథ , తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ పుస్తకం 2026, నవంబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో గ్లింప్స్‌లో 1960ల నాటి తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 1960ల మధ్యకాలంలో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ‘వర్సిటీ రెస్టారెంట్’ అనే ఒక గ్రీక్ రెస్టారెంట్లో వీరిద్దరి తొలి పరిచయం జరిగింది. అప్పట్లో ఇంగ్లాండ్‌లో ఆహారం అంతగా నచ్చకపోవడంతో, తన సొంత దేశం ఇటలీ వంటకాలకు దగ్గరగా ఉండే రుచుల కోసం వెతుకుతుండగా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. రాజీవ్‌ను మొదటిసారి చూసిన వెంటనే ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని తనకు అనిపించిందని, రాజీవ్ మనసులో కూడా అదే భావన కలిగిందని సోనియా తెలిపారు.
రాజీవ్ గాంధీ అందగాడు మాత్రమే కాకుండా, ఆయనలోని నెమ్మదితనం, సౌమ్యత తనను ఎంతో ఆకట్టుకున్నాయని సోనియా గుర్తుచేసుకున్నారు. ప్రారంభంలో వీరి పరిచయం స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమగా రూపాంతరం చెందింది. విద్యార్థి రోజుల్లో పార్టీలకు వెళ్లడం, విహారయాత్రలు చేయడం వంటి సాధారణ జ్ఞాపకాలతో వారి అనుబంధం బలపడింది. అనంతరం 1968లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారతదేశ ప్రధానిగా సేవలందించారు. ఆ తర్వాత 1991లో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన దారుణంగా హత్యకు గురయ్యారు. రాజీవ్‌తో గడిపిన ఆనందకర క్షణాలు, వారి ప్రేమ ప్రపంచాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించినట్లు సోనియా పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, వారిద్దరి వ్యక్తిగత జీవితం, అనుబంధాన్ని ఈ ఆత్మకథ ద్వారా పాఠకులకు అందించనున్నారు.

