Jagga Reddy: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జీవిత కథ ఆధారంగా నిర్మించనున్న సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్‌ను ఎంపిక చేసినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. గతంలో ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాధవ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి సోనియా గాంధీ అనుమతి తీసుకునేందుకు డిసెంబర్ 10 నుంచి తాను ఢిల్లీకి వెళ్లనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.
సోనియా గాంధీ రచించిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకంలోని ప్రధానాంశాలను కథాంశాలుగా తీసుకుని ఈ సినిమాను రూపొందించనున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ రాసిన ఆత్మకథ పుస్తకాన్ని దేశ, విదేశీ ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చూపించేందుకే ఈ చిత్రాన్ని తీస్తున్నామని వివరించారు. ఈ సినిమాలో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల ప్రేమ కథ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల బలిదానాలు, దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్పష్టంగా చూపించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఇందిర, రాజీవ్ గాంధీల అనంతరం సోనియా గాంధీ దేశం కోసం చేసిన సేవలు, ప్రజల కోసం ఆమె రాజకీయ ప్రవేశం, ప్రధానమంత్రి పదవుల త్యాగం, పేద ప్రజల కోసం తీసుకున్న సంచలన నిర్ణయాలను ఇందులో ఆవిష్కరించనున్నారట. ఎలాంటి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ఆశించకుండా కేవలం గాంధీ కుటుంబ నేపథ్యంతోనే ఈ సినిమాను తీయనున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ చిత్ర నిర్మాణం కోసం ఎవరి దగ్గరి నుంచీ ఒక్క పైసా కూడా తీసుకోమని, తమ సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలు 50 మందితో ఒక ఫైనాన్స్ కమిటీని ఏర్పాటు చేసి తామే సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.

