Son Spreads AIDS Rumour to Evict Mother in Jogulamba Gadwal: నేటి సమాజంలో రోజురోజుకూ దుర్మార్గాలు పెరిగిపోతున్నారు. ఆస్తి కోసం కొందరు దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు. నవమాసాలు మోసిన కన్న తల్లినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయితే తాజాగా మరో నీచమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి మొత్తం రాయించుకున్నాక.. కన్న తల్లికి ఎయిడ్స్ ఉందని కొడుకే పుకార్లు పుట్టించి ఇంట్లో నుంచి గెంటేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హుస్సేన్‌బీ (80) పేరిట 8 ఎకరాల భూమి ఉంది. జీవిత కాలం దగ్గరుండి మరీ చూసుకుంటానని చిన్న కుమారుడు ఇస్మాయిల్ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. కసాయి కుమారుడి మాటలు నమ్మిన హుస్సేన్‌బీ తన పేరుపై ఉన్న భూమిని కొడుకు ఇస్మాయిల్, కోడలు సాభేరాభాను పేరిట రాయించింది. రామాపురం శివారు, జూలకల్ శివారులోని భూమిని శాంతినగర్ తహసీల్దార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
Also Read: Raj Gopal Reddy: మేమిద్దరం అన్నదమ్ములమని అప్పుడు తెలియదా?.. మరోసారి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్!
హుస్సేన్‌బీ పేరిట ఉన్న మొత్తం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కొడుకు ఇస్మాయిల్, కోడలు సాభేరాభాను ప్లేట్ మార్చారు. కొడుకు తల్లిని వేధించడం మొదలు పెట్టాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఎన్నో మాటలు అన్నాడు. చివరకు తల్లికి ఎయిడ్స్ ఉందని ప్రచారం చేసి ఇంటి నుంచి గెంటేశాడు. దాంతో గ్రామంలో ఆమెకు కనీసం ఎవరూ మంచినీరు కూడా ఇవ్వలేదు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కె.మోహన్ రావు సాయంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను హుస్సేన్‌బీ ఆశ్రయించారు. తన రెండో కుమారుడు, కోడలు నమ్మించి మోసం చేశారని, తన బాగోగులు చూడటం లేదని, మానసికంగా కృంగదీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న తులం బంగారం, బ్యాంక్ ఖాతాలోని డబ్బు తీసుకున్నారని తెలిపారు. గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి.. మళ్లీ తన పేరున భూమి నమోదు చేయాలని కోరారు. తన ఇంటిలో ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హుస్సేన్‌బీ కోరారు. న్యాయం చేస్తామని కలెక్టర్, ఎస్పీలు ఆమెకు హామీ ఇచ్చారు.
