Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

Software Engineer

Software Engineer

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేబుల్ బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోని నాచారం ప్రాంతంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. కాగా, నిన్న మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్న తన స్నేహితులను కలిసేందుకు రాజేష్ అక్కడికి వెళ్లాడు. స్నేహితులను కలిసిన అనంతరం, సాయంత్రం సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లిన రాజేష్.. బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా చెరువులోకి దూకేశాడు. ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని గమనించిన తోటి పర్యాటకులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాజేష్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల సహాయంతో నిన్నటి నుంచి గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాజేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పని ఒత్తిడి కారణమా లేక వ్యక్తిగత సమస్యలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజేష్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతుడి ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.