Snake in Fridge: మానవుడు తన అవసరాల కోసం అడవులను హరిస్తున్నాడు. దీంతో అక్కడ నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం ఇటీవల ఎక్కువైంది. పాములు తమ పుట్టలను వదిలి అవి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో దూరుతున్నాయి. ఇండ్లలోనూ, వాహనాల్లో దూరిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా కర్ణాటకలోని తుమకూరులో ఓ నాగుపాము ఇంట్లోని ఫ్రిజ్ కంప్రెషర్‌లోకి దూరింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరు అడుగుల పొడవు గోల్డ్ కలర్ లో ఉన్న నాగుపామును చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అప్పటి దాకా బుస్ బుస్ అని శబ్ధం వస్తుంటే ఎక్కడినుంచి వస్తుందోనని ఇళ్లంతా గాలించారు. చివరకు ఫ్రిజ్ వెనుకభాగంలో చూడగా బుసలు కొడుతున్న నాగుపామును గమనించారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ సహయంతో ప్రెషర్‌లో దూరిన నాగుపామును పట్టేశారు. ఆ సమయంలో నాగుపాము పడగవిప్పుతూ బుసలు కొట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ ఆ పామును ఓ డబ్బాలో వేసి, అనంతరం అడవిలో వదిలిపెట్టాడు. ఇటీవల ఓ యువకుడి దుప్పుట్లోకి దూరిన నాగుపాము.. రాత్రంతా అతనితో పాటు నిద్రించిన ఘటన చూశాం.
