NTV Telugu Site icon

WPL 2023: ఆర్సీబీ కెప్టెన్‌గా మంధానా.. ప్రకటించిన కోహ్లీ, డుప్లెసిస్

2

2

విమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ టీమ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ఐదు జట్లు పోటీపడుతుండగా ఇటీవలే ప్లేయర్ వేలం పూర్తయింది. ఈ మెగావేలంలో మంధానాను ఆర్సీబీ రూ 3.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఆమెకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్‌ డుప్లెసిస్‌తో మంధాన కెప్టెన్‌గా నియమితురాలైన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మేనేజ్‌మెంట్. స్మృతికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇక, ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధానా.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్‌ అని సంతోషం వ్యక్తం చేసింది. విరాట్‌, డుప్లెసిస్ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.

మంధానా రికార్డు

డబ్ల్యూపీఎల్‌ వేలం-2023లో స్మృతి కోసం 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో తొలి విమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా స్మృతి పేరు రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి విమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం కానుంది.

Also Read: Akhil Akkineni: ‘ఏజెంట్’ సైలెన్స్ ‘వయోలెన్స్’ని డిఫైన్ చేస్తుంది…