Smit Machchhar: అంతెత్తు ఆకాశంలో, విమానాన్ని నడుపుతున్న ఆ క్షణంలో చావు కళ్లముందు కనిపించింది. తోటి పైలటే ప్రాణాలు తీసేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఒళ్లంతా తీవ్ర గాయాలు, రక్తం ఓడుతున్న స్థితి.. ఒక్క క్షణం అలసత్వం వహించినా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం. అలాంటి భయానక వాతావరణంలోనూ ఆ భారతీయ కెప్టెన్ ధైర్యం కోల్పోలేదు. మనసులోనే ‘హనుమాన్ చాలీసా’ స్మరిస్తూ.. చావుతో పోరాడి, చివరి శ్వాస వరకు ప్రయత్నించి విమానాన్ని, అందరి ప్రాణాలను కాపాడారు. ఆ వీరుడే ఫ్లైదుబాయ్ విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, నిగ్రహాన్ని ప్రధాని ప్రశంసించారు. దేశమంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. మన భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదని, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే స్వభావం ఉన్నవారని చెప్పడానికి స్మిత్ నిదర్శనమని మోడీ కొనియాడారు. స్మిత్ తల్లి గీతా బెన్, భగవద్గీతలోని గొప్ప విలువలని ఆయనకు నేర్పించి పెంచారని ప్రధాని ప్రశంసించారు.
ప్రధాని మోడీతో మాట్లాడటం స్మిత్‌ను తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. సంభాషణ సమయంలో మచ్ఛర్ భావోద్వేగానికి లోనై, ఇది తనకు చాలా ప్రత్యేకమైన క్షణం అన్నారు. “మీరే(మోడీ) నాకు ఆదర్శం. మీరు నన్ను ఇలా స్వయంగా పలకరించి ధైర్యాన్ని ఇవ్వడం నా జీవితంలో మర్చిపోలేను. నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ సమయంలో నేను తీవ్రంగా గాయపడ్డాను. కానీ లేచి నిలబడాలని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఆ క్షణంలో నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. ఆ దాడిలో నేను కింద పడిపోయాను, కానీ నేను లేవకపోతే చనిపోతానని గ్రహించాను. 11 ఏళ్లుగా కెప్టెన్‌గా సేవలందిస్తున్నా.. ఆ భగవంతుడే నన్ను కాపాడాడు.. ప్రమాద సమయంలో హనుమాన్ చాలీసా చదివా.. ఒక్కసారిగా విమానం కిందకు వెళ్లడాన్ని గుర్తించా.. ప్రయాణికులంతా చనిపోతారని భయపడ్డా.. కత్తిపోట్లతోనే అతి కష్టం మీద కాక్‌పిట్ తెరిచా.. ప్యాసింజర్లు వచ్చి ఫ్లైటు అదుపులోకి తీసుకున్నారు.” అని పైలట్ స్మిత్ మచ్ఛర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠించడం తనకు అలవాటని, ఆ దాడి సమయంలో కూడా తాను అదే స్మరిస్తూ పోరాడానని ఆయన తెలిపారు.

