NTV Telugu Site icon

Kamindu Mendis: ఒక సెంచరీ.. ఏకంగా ఐదు రికార్డులు సొంతం! డాన్‌ బ్రాడ్‌మన్‌తో సమంగా

Kamindu Mendis Test Record

Kamindu Mendis Test Record

Kamindu Mendis All-Time Test Records: గాలే అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్‌ అద్భుత సెంచరీ చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కమిందు.. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. శ్రీలంక 29 ఓవర్లలో 89/3 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన కమిందు.. కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు స్కోరును 302కు చేర్చాడు. కమిందు ఒక్క శతకంతో ఏకంగా ఐదు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

తొలి శ్రీలంక క్రికెటర్‌గా:
కమిందు మెండిస్‌ తాను ఆడిన ఏడు టెస్టుల్లో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో ప్రతి మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన కమిందు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధిస్తే.. మరో రికార్డును సొంతం చేసుకుంటాడు. ఇప్పటికే పాక్‌ బ్యాటర్ నమోదు చేసిన రికార్డును సమం చేసిన కమిందు.. మరో హాఫ్ సెంచరీతో తొలి బ్యాటర్‌ అవుతాడు.

టాప్ ఆసియా క్రికెటర్:
కమిందు మెండిస్ ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 809 పరుగులు చేశాడు. కమిందు బ్యాటింగ్‌ యావరేజ్‌ 80.90గా ఉంది. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆసియా బ్యాటర్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాడిగా కమిందు కొనసాగుతున్నాడు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (68.53) రెండో స్థానంలో ఉన్నాడు.

కేన్‌ మామను దాటాడు:
ఓ డబ్ల్యూటీసీ సీజన్‌లో కనీసం 10 ఇన్నింగ్స్‌ కంటే ఎక్కువగా ఆడిన బ్యాటర్ల జాబితాలో కమిందు మెండిస్‌దే అత్యుత్తమ సగటు (80.90). న్యూజీలాండ్ బ్యాటర్ కేన్‌ విలియమ్సన్‌ (75.2) రెండో స్థానంలో ఉన్నాడు.

Also Read: Rishabh Pant: 632 రోజుల తర్వాత.. టీమిండియాకు ఆడబోతున్న పంత్!

దిముత్‌ను సమం చేసాడు:
ఓ డబ్ల్యూటీసీ సీజన్‌లో ఎక్కువ సెంచరీలు (4) చేసిన బ్యాటర్‌గా కమిందు మెండిస్‌ ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్‌ దిముత్‌ కరుణరత్నె 2019-21లో నాలుగు సెంచరీలు సాధించాడు. 2023-25 సీజన్‌లో ఇప్పటికే నాలుగు శతకాలు బాదిన కమిందు.. దిముత్‌ను సమం చేశాడు. మరో సెంచరీ చేస్తే ఈ రికార్డు కూడా కమిందు పేరిటే నమోదవుతుంది.

బ్రాడ్‌మన్‌ సరసన:
కమిందు మెండిస్‌ 11 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు చేశాడు. దాంతో వేగంగా నాలుగు శతకాలు చేసిన తొలి శ్రీలంక బ్యాటర్‌గా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ కూడా తన మొదటి నాలుగు సెంచరీలను 11 ఇన్నింగ్స్‌లలో బాదాడు. దాంతో బ్రాడ్‌మన్‌ సరసన కమిందు చేరాడు.

Show comments