Site icon NTV Telugu

Rajanna Sircilla: విషాదం.. గుండెపోటుతో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మృతి..

Brs

Brs

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్‌ఠానా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి.. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. వేములవాడ అర్బన్ మండలం, చింతల్‌ఠానా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి నిన్న అకస్మాత్తుగా కుప్పచూలాడు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా నిన్నటి వరకు ప్రచారం నిర్వహించిన చెర్ల మురళి, గ్రామస్థులకు ప్రజాసేవ చేయాలని ఎన్నో కలలు కన్నారు. గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 22,330 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలు, బుజ్జగింపుల తరువాత 395 గ్రామాలు ఏకగ్రీవం అయినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటిలో వికారాబాద్ జిల్లా 39 గ్రామాలతో అత్యధిక ఏకగ్రీవాలు నమోదు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాలు ఏకగ్రీవం కాగా, ఇది రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.

అత్యల్ప ఏకగ్రీవాలు నమోదైన జిల్లాలుగా కరీంనగర్ (3 గ్రామాలు), అలాగే హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి (ప్రతి జిల్లా 4 గ్రామాలు) నిలిచాయి. మరోవైపు ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో, ఆ గ్రామాలపై ఎన్నికల కమిషన్ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక, మొదటి విడతలో 3,836 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో.. సర్పంచ్ పదవికి 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 37,440 వార్డులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, 27,960 వార్డులకు మాత్రమే ఎన్నిక జరగనుంది.

Exit mobile version