Site icon NTV Telugu

Sini Shetty: మిస్ వరల్డ్‌కు పోటీపడుతున్న సినీ శెట్టి ప్రస్థానమిదే!

Cini Miss

Cini Miss

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా ఋషులవుతారు అని ఓ సినీ కవి అన్నారు. ఇది తెలుగు సినిమాలోని పాట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.

28 ఏళ్ల తర్వాత భారతదేశంలో ప్రపంచ సుందరి పోటీలు (Miss World 2024) జరగతున్నాయి. ముంబై వేదికగా శనివారం అత్యంత వైభవంగా జరగనున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది. అయితే ఈసారి ఇండియా నుంచి 22 ఏళ్ల సినీ శెట్టి పాల్గొంటోంది. అయితే ఇప్పుడు ఆమె గురించే చర్చ జరుగుతోంది. అసలు ఆమెవరు? అక్కడ వరకు ఎలా వచ్చిందంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.

ఏదో తనకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ వెళ్లిపోతున్న సినీ శెట్టికి (Sini Shetty) అనుకోని విధంగా ఎవరో సలహా ఇవ్వడం.. వెంటనే కార్యాచరణలోకి తెచ్చేసింది. భారతీయ అందాల పోటీల్లో పాల్గొని 2022లో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకునే అవకాశం వచ్చింది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. శనివారం సాయంత్రం ముంబైలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె పాల్గొంటోంది. కిరీటం సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది. తొలి ప్రయత్నంలోనే మిస్ కర్ణాటక, మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్‌లో కూడా ప్రయత్నిస్తోంది. దీన్ని కూడా సొంతం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

సినీ శెట్టి ప్రస్థానం ఇలా..
సినీ శెట్టి.. కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. కానీ పెరిగిందంతా ముంబైలోనే. అకౌంటింగ్ మరియు ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ఎంఎన్‌సీలో ఉద్యోగాన్నీ సంపాదించింది. తాజాగా సీఎఫ్‌ఏ చదువుతోంది. ఇక 14వ ఏటనే భరతనాట్యంలో ఆరంగేట్రం చేసింది.

అంతేకాకుండా వెస్ట్రన్‌ డ్యాన్స్‌ నేర్చుకుంది. ఆ వీడియోలను సినీ శెట్టి తన ఇన్‌స్టా, యూట్యూబ్‌ ఖాతాల్లో పంచుకుంటుంది. తన ఎత్తును చూసి ఆఫీసులో ఎవరో మోడలింగ్‌ చేస్తే చక్కగా రాణిస్తావు అని సలహా ఇచ్చారట. అలా ప్రయత్నించగానే కొద్దిరోజుల్లోనే వరస అవకాశాలు క్యూ కట్టాయి. పాంటలూన్స్‌, షుగర్‌ కాస్మెటిక్స్‌, ఎయిర్‌టెల్‌, గ్లోబల్‌ దేశీ ఇలా ఎన్నో ప్రకటనల్లో తళుక్కుమని మెరిసింది. ఇలా చేస్తుండగానే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన లేకపోయినా.. మిస్‌ ఇండియా పోటీలకు సంబంధించిన ప్రకటన మాత్రం ఆమెను బాగా ఆకట్టుకుంది. అంతే దరఖాస్తు చేసుకోవడం.. పోటీల్లో పాల్గొనడం అలా ‘మిస్‌ కర్ణాటక’, ఆపై ‘మిస్‌ ఇండియా’ కిరీటాలు సొంతం చేసేసుకుంది.

శనివారం సాయంత్రం ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లో కూడా సత్తా చాటడానికి సిద్ధమైంది. ప్రియాంక చోప్రా సాధించినట్టుగానే తాను కిరీటం సొంతం చేసుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకుని దేశం గర్వపడేలా చేస్తామని చెప్పుకొస్తోంది. మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

దాదాపు 28 సంవత్సరాల విరామం తర్వాత ప్రతిష్టాత్మక అందాల పోటీ భారతదేశానికి తిరిగి వచ్చింది, ఈ పోటీల్లో 112 దేశాల నుంచి వచ్చిన పోటీదారులు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. వాస్తవానికి ఈ అందాల పోటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగాల్సి ఉంది. అయితే ఇది ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు మార్చారు. మార్చి 9న (శనివారం) జరిగే ఈవెంట్ 140 దేశాల్లో ప్రసారం చేయబడుతుంది.

Exit mobile version