Site icon NTV Telugu

Singapore Airlines: వెలుగులోకి భయానక దృశ్యాలు.. హడలెత్తిపోయిన ప్యాసింజర్స్

Arir

Arir

సింగపూర్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులోని దృశ్యాలు చూస్తుంటే.. ఎంతగా ప్రమాదం జరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది. విమానం లోపలి భాగాలు ఊడిపోవడం.. సీట్లలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోవడం… ఆయా వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయిన సన్నివేశాలు కనిపించాయి. దీనిని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లండన్ నుంచి సింగపూర్‌కు వెళ్తుండగా అకస్మాత్తుగా గగనతలంలో భారీ కుదుపులోకి లోనైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. దాదాపుగా 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుని కుటుంబానికి ఎయిర్‌లైన్స్ సంతాపం తెలిపింది. అలాగే క్షతగాత్రులకు వైద్య సదుపాయం అందిస్తోంది. ఆకాశంలో అలజడికి గురికాగానే థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.

లండన్‌ నుంచి సింగపూర్‌కు విమానం బయల్దేరి అప్పటికే 11 గంటలైంది. మరికొన్ని గంటల్లో గమ్యస్థానం చేరాల్సి ఉంది. మేఘాల మధ్యలో విమానం వేగంగా దూసుకెళుతోంది. కొందరు ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే.. చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. పై నుంచి వస్తువులు జారి పడుతున్నాయి.. సీట్లలో ఉండాల్సిన వ్యక్తులు ఎగిరి పడుతున్నారు.. ఆకాశం నుంచి ఒక్క ఉదుటన దూకేసినట్లుగా ఉంది పరిస్థితి. ఆ గందరగోళం మధ్య విమానం బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానమంతా చిందర వందర.. రక్తపు మరకలు అంటుకున్నాయి. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది.

ఇదిలా ఉంటే కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ సమయంలో 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో 31 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 6 వేల అడుగులు కిందకు దిగిందని ఫ్లైట్‌ రాడార్‌ 24 డేటాను బట్టి తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. విమానంలోని ఓవర్‌ హెడ్‌ బిన్స్‌, దుప్పట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. మాస్కులు, లైటింగ్‌, ఫ్యాన్‌ ప్యానెల్స్‌ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాయి. ఇలాంటి సమయాల్లో సీటు బెల్టులు పెట్టుకోవాలని పైలట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉండదని, అందుకే ప్రయాణికులకు గాయాలవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సీటు బెల్టును ఎల్లవేళలా ధరించడం మంచిదని సూచిస్తున్నారు.

 

Exit mobile version