Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..

Best E Scooter

Best E Scooter

ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో అత్యధిక రేంజ్ ఇస్తామని చెబుతూ సింపుల్ ఎనర్జీ సంస్థ ‘సింపుల్ అల్ట్రా’ పేరుతో ఒక ప్రీమియం ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.49 లక్షలుగా ఉంది.

ఈ స్కూటర్‌లో మొత్తం 6.5 kWh కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో 5 kWh మెయిన్ బ్యాటరీతో పాటు 1.5 kWh సెకండరీ బ్యాటరీ ఉంటాయి. దీనిని ఫాస్ట్ ఛార్జర్ ద్వారా సుమారు 2 గంటల 15 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సాధారణ పోర్టబుల్ ఛార్జర్ అయితే పూర్తిగా నిండడానికి దాదాపు 8 గంటల 30 నిమిషాలు పడుతుంది.

ఇందులోని శక్తివంతమైన PMSM మోటార్ 8.8 kW పీక్ పవర్‌ను, 72 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు కాగా, కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మెరుగైన ప్రయాణ అనుభూతి కోసం ఇందులో ఎకో, రైడ్, సోనిక్ వంటి ఆరు రైడింగ్ మోడ్‌లతో పాటు నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లను అందించారు.

సేఫ్టీ, టెక్నాలజీ పరంగా ఈ స్కూటర్‌లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత సింపుల్ OS, మ్యాప్‌మైఇండియా నావిగేషన్, హిల్ హోల్డ్ అసిస్ట్, రిజెనరేటివ్ బ్రేకింగ్, డ్రాప్ సేఫ్ టెక్నాలజీ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్, జియోఫెన్సింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వారంటీ విషయానికి వస్తే.. వాహనానికి 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ, అలాగే బ్యాటరీ, మోటార్‌కు ‘సూపర్ ప్రొటెక్ట్’ ప్లాన్ కింద 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వారంటీ ఇస్తున్నారు. రోజువారీ ప్రయాణాలతో పాటు సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.