Siddu Jonnalagadda Birthday: గత సంవత్సరం టాప్ టెన్ యూ ట్యూబ్ సాంగ్స్ లో నంబర్ వన్ ప్లేస్ లో నిలచిన పాట ఏదంటే ‘డీజే టిల్లు’లోని టైటిల్ సాంగ్ కావడం విశేషం! దాదాపు 225 మిలియన్ వ్యూస్ సాధించి, ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉందీ పాట. అదే కాదు ఈ సినిమా హీరో సిద్ధూ జొన్నలగడ్డ సైతం ఒక్కసారిగా జనం మదిని దోచేశాడు. ప్రస్తుతం ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో మరోమారు టిల్లుగా అలరించే ప్రయత్నంలో ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ.
సిద్ధార్థ్ జొన్నలగడ్డ 1990 ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జన్మించారు. ఎమ్.బి.ఏ. చదివిన సిద్ధూ మనసు సినిమాలవైపు మళ్ళింది. చదువుకొనే రోజుల్లోనే అవకాశాల కోసం వేట ఆరంభించాడు సిద్ధు. అలా కొన్ని సినిమాల్లో తళుక్కుమన్నాడు. నాగచైతన్య హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘జోష్’లో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు సిద్ధూ. తరువాత రామ్ చరణ్ ‘ఆరెంజ్’లోనూ, నాని ‘భీమ్లి కబడ్డీ జట్టు’లోనూ చిన్న పాత్రల్లో మెరిశాడు. ప్రవీణ్ సత్తారు రూపొందించిన ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’లో ముగ్గురు హీరోల్లో ఒకరిగా నటించాడు. ఆ పై ‘వల్లినమ్’ అనే తమిళ చిత్రంలోనూ నటించాడు. తరువాత “బాయ్ మీట్స్ గర్ల్, ఐస్ క్రీమ్-2, గుంటూరు టాకీస్, కల్కి” వంటి చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించాడు సిద్ధు. ఆయన హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాథ వినుమా” చిత్రాల్లోనూ సిద్ధు నటించాడు. ఆ పైనే ‘డిజె టిల్లు’లో నటించి, అలరించాడు సిద్ధు. ఈ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణతో కలసి సిద్ధు కథను తయారు చేసుకున్నాడు. తన పాత్ర ఎలా ఉండాలో, ఎలా ఉంటే యువతను ఆకట్టుకుంటుందో ఊహించి, అందుకు తగ్గట్టుగా రూపొందించుకున్నాడు సిద్ధు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ‘డీజే టిల్లు’ రూ.30 కోట్లకు పైగా పోగేసింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు నటిస్తున్నాడు.
Vijay Deverakonda: ఇది మా పాట, ఇది మా ఆట, ఇది మా జట్టు…
డీజే టిల్లుగా అలరించగానే సిద్ధూకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అన్నిటినీ అంగీకరించకుండా, ఆచి తూచి అడుగేస్తున్నాడు సిద్ధు. హిందీ ‘క్వీన్’ ఆధారంగా తెరకెక్కిన ‘దటీజ్ మహాలక్ష్మి’లోనూ సిద్ధు నటించాడు. ఆ సినిమా 2014లోనే వెలుగు చూడవలసింది. ఇంకా విడుదల కాలేదు. ‘తల్లు మాల’ మళయాళ చిత్రం ఆధారంగా రూపొందే సినిమాలోనూ సిద్ధూ నటించనున్నాడు. యువతలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఇకపై ఏ తీరున మురిపిస్తాడో చూడాలి.