Siddipet: చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్‌కు జిల్లా కలెక్టర్ అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్‌లో 93.69 శాతం మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటీలో సీటు సాధించాడు. పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ స్పందించారు.
Read Also: Pickle In Hotel Meals: హోటల్ భోజనంలో ఊరగాయ పెట్టలేదని కోర్టులో కేసు.. చివరకు?
శుక్రవారం నాడు ఆ విద్యార్థిని కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో సీటు పొందిన ఆర్యన్ రోషన్‌కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు. అలాగే చదువు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్‌ను కూడా కొనిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, ఇతర అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. బి.ఆర్యన్ రోషన్ తండ్రి తన చిన్నతనంలోనే మరణించినా.. తల్లి రాజమణి రోజూ కూలి చేసి తనను చదివించగా పట్టుదలతో చదివి ఐఐటిలో సీటు పొందినందుకు అభినందనలు తెలుపుతూ.. ఇలాగే ఐఐటీ పూర్తి చేసుకుని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ పేర్కొన్నారు చదువుకోవాలనే ఆసక్తి గల నిరుపేదలకు ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకంగా నిలవాలని ఆకాంక్షించారు.