NTV Telugu Site icon

Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకేఎస్.. పార్టీ అధికారిక ప్రకటన

Congress

Congress

Karnataka CM Siddaramaiah: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం.. చివరకు సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది. ఎట్టకేలకు కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఏకైక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు కేపీసీసీ అధ్యక్షుడిగానూ డీకే సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం మే 20న ఉంటుందని వెల్లడించారు. కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్‌ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

Read Also: Jallikattu: ఆ ఆట సంస్కృతిలో భాగం.. జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తూ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఆదివారం తీర్మానం చేశారు. దీనిని పరిశీలించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించి సీఎం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితం వెలువడినప్పటి నుంచే సిద్ధరామయ్య​ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి అంటూ ఆయన అభిమానులు సందడి చేశారు. ఆయన ఇంటి వద్ద పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఎమ్మెల్యేలో మెజారిటీ సభ్యులు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్‌ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎం పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయనను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్‌ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.