Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!

  • భారతదేశానికి చెందిన శ్రీధర్ చిల్లాల్
  • ఎడమ చేతి గోర్లను ఏకంగా 66 ఏళ్ల పాటు పెంచి..
  • గిన్నిస్ బుక్ లో స్థానం..
Shridhar

Shridhar

Shridhar Chillal: ఎడమచేతి వాటం.. మనలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ స్వభావం ఉంటుంది. నిజానికి ప్రపంచంలో దాదాపు 10% మంది మాత్రమే ఉంటారని సమాచారం. అయితే భారత్‌కు చెందిన శ్రీధర్ చిల్లాల్ తన ఎడమ చేతిని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. ఏకంగా 66 ఏళ్ల పాటు ఎడమ చేతి గోర్లను పెంచి, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన గోర్ల మొత్తం పొడవు దాదాపు మూడు అంతస్తుల భవనం ఎత్తుతో సమానంగా ఉంటుందంటే నమ్ముతారా..

నిజానికి నవంబర్ 17, 2014నే మహారాష్ట్రలోని పుణే నగరంలో శ్రీధర్ చిల్లాల్ ఎడమ చేతి గోర్లను కొలిచారు గిన్నిస్ బుక్ నిర్వాహకులు. మొత్తం ఐదు గోర్ల పొడవు కలిపి 909.6 cm అంటే 29 అడుగుల 10 అంగుళాలుగా నమోదైంది. దీంతో ఒకే చేతిపై అత్యంత పొడవైన గోర్లు కలిగిన వ్యక్తిగా ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. శ్రీధర్ చిల్లాల్ చేతిలో ఒక్కో గోరు పొడవు కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. చిటికెన వేలు గోరు 179.1 cm, ఉంగరపు వేలు గోరు 181.6 cm, మధ్య వేలు గోరు 186.6 cm, చూపుడు వేలు గోరు 164.5 cm, బొటనవేలు గోరు ఏకంగా 197.8 cm పొడవు ఉన్నాయి.

ఓ టీచర్ మాటతో మొదలైన సవాలు:

శ్రీధర్ చిల్లాల్ గోర్లు పెంచడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 1952లో ఆయనకు 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. అతని స్నేహితుడు పొరపాటున తమ టీచర్ పొడవైన గోరును విరగ్గొట్టాడు. దీనిపై టీచర్ స్పందిస్తూ.. పొడవైన గోర్లను ఎలా సంరక్షించాలో అర్థం చేసుకోవాలంటే వాటిని పెంచి చూడాలని విద్యార్థులకు సూచించారు. ఆ మాట శ్రీధర్‌ను ఎంతగానో ప్రభావితం చేయడంతో ఆయన.. ఎవరి గోర్లు ఎక్కువ పొడవుగా పెరుగుతాయో చూడటానికి సవాలుగా తీసుకున్నారు. అలాగే ఆయన కూడా గోర్లు పెంచడం మొదలుపెట్టారు.

రోజువారీ జీవితం కూడా కష్టమే:

గోర్లు పెరుగుతున్న కొద్దీ శ్రీధర్‌కు రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవారు. కానీ సాధారణ కెమెరాను ఉపయోగించడం కష్టంగా మారడంతో, పొడవైన గోర్లకు అనుగుణంగా ప్రత్యేకమైన హ్యాండిల్‌ను తయారు చేయించుకుని కెమెరాను ఉపయోగించాల్సి వచ్చేది. అయినప్పటికీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలనే లక్ష్యంతో ఆయన తన గోర్లను పెంచుతూనే ఉన్నారు. చివరకు 2014లో ఆయన పేరు ప్రపంచ రికార్డుల్లో నమోదైంది.

సుమారు 66 ఏళ్ల పాటు గోర్లను పెంచిన తర్వాత 2018 జూలైలో శ్రీధర్ వాటిని కత్తిరించాలని నిర్ణయించుకున్నారు. ఇన్నేళ్లుగా తనకు లభించిన గుర్తింపు, ప్రజల ఆసక్తిని ఆయన ఆస్వాదించినప్పటికీ, చివరకు గోర్లను కత్తిరించే సమయం వచ్చిందని భావించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు తన జీవితంలో అతిపెద్ద లక్ష్యాన్ని సాధించిన అనుభూతిని ఇచ్చిందని శ్రీధర్ పేర్కొన్నారు. ఒక చేతిపై అత్యంత పొడవైన గోర్ల రికార్డుతో పాటు, ఆయన అత్యంత పొడవైన ఒక్క గోరు రికార్డును కూడా సాధించారు. ఆయన బొటనవేలు గోరు చుట్టుకుని పెరిగిన పొడవు ఒక సాధారణ తలుపు ఎత్తుతో సమానంగా ఉన్నాయి. శ్రీధర్ గోర్లు ఇప్పుడు కూడా ప్రజలకు కనిపించేలా భద్రపరిచారు. అమెరికాలోని న్యూయార్క్, నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న Ripley’s Believe It or Not! మ్యూజియంలో ఆయన గోర్లను శాశ్వతంగా ప్రదర్శిస్తున్నారు.

శ్రీధర్ తర్వాత కూడా..

ప్రపంచంలో అత్యంత పొడవైన గోర్లతో రికార్డులు సాధించిన వ్యక్తుల్లో అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఉన్నారు. ఆమె రెండు చేతుల గోర్ల మొత్తం పొడవు 1,306.58 cm (42 అడుగుల 10.4 అంగుళాలు)గా నమోదైంది. ఆమె 1997 నుంచి గోర్లను కత్తిరించలేదు. 2024లో ఆమెను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ‘GWR ICON’గా గుర్తించింది. అలాగే వియత్నాంకు చెందిన కళాకారుడు లూ కాంగ్ హుయెన్ కూడా గోర్ల విషయంలో ప్రత్యేక రికార్డు సృష్టించారు. ఆయన 34 ఏళ్లుగా గోర్లను పెంచుతున్నారు. 2025 జనవరి 15న రెండు చేతులపై అత్యంత పొడవైన గోర్లు కలిగిన పురుషుడిగా గిన్నిస్ రికార్డు సాధించారు. ఆయన గోర్లు ఒకదానికొకటి చుట్టుకుని పెరిగి, మొత్తం 594.45 సెం.మీ (19 అడుగుల 6 అంగుళాలు) పొడవు ఉన్నాయి.